ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎండల ధాటికి జనాలు అల్లాడిపోతున్నారు. మరోపక్క ఎండలతోనే సతమవుతుంటే.. వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలపింది. ఈ క్రమంలో రేపు (మంగళవారం) రాష్ట్రంలోని 63 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
బుధవారం కూడా.. 38 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 135 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రేపు పార్వతీపురంమన్యం 13, శ్రీకాకుళం 15, విజయనగరం 22, అల్లూరి 3, అనకాపల్లి 4, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3, అనకాపల్లి 12, కాకినాడ 16, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 13, కృష్ణా 7, ఎన్టీఆర్ 7, గుంటూరు 7, పల్నాడు 4 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు.
కాగా.. సోమవారం పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 43.9°C, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.1°C, పల్నాడు జిల్లా విజయపూరిలో(మాచెర్ల), విజయనగరం జిల్లా రాజాంలో 42.8°C, అనకాపల్లి గడిరైలో 42.7°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 75 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని ఆయన సూచించారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు https://apsdma.ap.gov.in/files/d4da70e8515548a82577b067749efa71.pdf లింకు ద్వారా తెలుసుకోవచ్చు.