ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ‘అలయ్ బలయ్’ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఇది 17వ ఆలయ్ బలయ్ కార్యక్రమన్నారు. ఈ నెల 6న ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్నామని, ఈ ఏడూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సారి ఐదు రాష్ట్రాల గవర్నర్‌లను, ముఖ్యమంత్రులను ఆహ్వానించామన్నారు. తెలంగాణ జేఏసీ కంటే ముందు ఆలయ్ బలయ్ ఏర్పాటు అయ్యిందని ఆమె వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్లు ఆమె వివరించారు. అంతేకాకుండా.. సినీనటుడు చిరంజీవి హాజరవుతున్నారని, మన రాష్ట్రంలో అందరి మంత్రులకు ఆహ్వానం ఇచ్చామన్నారు విజయలక్ష్మి.
ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ అని, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్ హాజరవుతారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను సన్మానం చేయాలని ఈ సారి కమిటీ నిర్ణయించిందని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, హర్యానా ఫోక్ డ్యాన్స్ ఈ సారి అలయ్ బలయ్ ప్రత్యేకత అని ఆమె తెలిపారు. ఎప్పటిలాగే అలయ్ బలయ్ రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్న విజయలక్ష్మి.. అన్ని పార్టీల నేతలు హాజరవుతారన్నారు. అయితే.. అలయ్ బలయ్‌కి సీఎం కేసీఆర్ స్థానం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.