Akhanda Movie: గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైన నటసింహ నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ‘అఖండ’ అనూహ్య విజయం సాధించింది. నిజానికి ఓ దశాబ్దమో, లేదా రెండు దశాబ్దాలో, లేక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు… ఇలా ఓ సంపూర్ణ సంఖ్య పూర్తి చేసుకున్న చిత్రాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాం. కానీ, గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ గురించి కూడా స్మరించుకోవడం ఏమిటి అన్న ఆలోచన కలగవచ్చు. తప్పులేదు. కానీ, ‘అఖండ’ విజయాన్ని స్మరించుకోక పోతేనే తప్పుగా భావించ వలసి వస్తుంది. ఎందుకంటే కరోనా రక్కసి కోరల్లో చిక్కిన సినిమా ప్రపంచవ్యాప్తంగా నలిగిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాకు 2020లో వచ్చిన సంక్రాంతి చిత్రాలు “సరిలేరు నీకెవ్వరు, అల..వైకుంఠపురములో” మినహాయిస్తే మళ్ళీ ఆ ఊపు రాలేదు. ఆ తరువాత ఓ యేడాది గడిచినా తెలుగు సినిమా కోలుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ సినిమా థియేటర్లకు మునుపటి కళ వస్తుందా అన్న అనుమానం కూడా జనానికి కలిగింది. అప్పుడు- సరిగా అప్పుడే – 2021 డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ విజయం అందరిలోనూ నెలకొన్న అనుమానాలను తుడిచేసింది. మళ్ళీ జనాలను థియేటర్లకు వచ్చేలా చేసింది.
అంతకు ముందు బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన “సింహా, లెజెండ్” చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో ఆరంభమైన ‘అఖండ’ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కు హ్యాట్రిక్ ను అందించింది. “సింహా, లెజెండ్, అఖండ” మూడు చిత్రాలు ఘనవిజయం సాధించడమే కాదు, నేరుగా రజతోత్సవాలు చేసుకొని తెలుగునాట ఓ అరుదైన రికార్డును నమోదు చేశాయి. ఈ ఘనత సాధించిన హీరో- డైరెక్టర్ కాంబోగా బాలయ్య, బోయపాటి కలయిక నిలచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ‘అఖండ’ చిత్రానికి థమన్ స్వరకల్పన ఓ ఎస్సెట్ గా నిలచింది. ఇందులోని ‘అఖండ’ టైటిల్ సాంగ్, ‘అమ్మా…’ అంటూ సాగే పాట, ‘అడిగా అడిగా…’ అంటూ మురిపించే గీతం జనాన్ని ఆకట్టుకున్నాయి. అన్నిటి కన్నా మిన్నగా “జై బాలయ్యా…” అంటూ అలరించిన పాటను అభిమానులు మరచిపోలేరు. అలాగే ఇందులో బాలయ్య నోట పరుగులు తీసిన మాటలు సైతం జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం బుల్లితెరపైనా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన తరువాత కూడా థియేటర్లలో సందడి చేయడమే విశేషం!
Manjima Mohan: హీరోయిన్ పెళ్ళికి వచ్చి ఆ పాడుపని చేసిన అతిధులు
నిజానికి ఈ సినిమా విడుదల సమయంలో తెలుగు సినిమాకు ఆయువు పట్టులాంటి ఆంధ్రప్రదేశ్ లో నిర్ణీత టిక్కెట్ ధరలే అమలులో ఉన్నాయి. టాప్ స్టార్స్ భారీ చిత్రాలకు టిక్కెట్ ధరలు పెంపు చేసుకొనే వీలు ఈ సినిమాకు కలుగలేదు. అయినప్పటికీ ఆ నిర్ణీత ధరల్లోనే రికార్డు కలెక్షన్స్ రాబట్టింది ‘అఖండ’. 103 కేంద్రాలలో (వీటిలో 28 డైరెక్టు) అర్ధశతదినోత్సవం జరుపుకొని మళ్ళీ స్టార్ హీరోల సినిమాల సక్సెస్ రేంజ్ ఏ పాటి ఉంటుందో నిరూపించిందీ చిత్రం. చిలకలూరి పేట, ఆదోని, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల కేంద్రాలలో డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకున్న ఈ మూవీ చిలకలూరి పేట రామకృష్ణ థియేటర్ లో నేరుగా 182 రోజులు ప్రదర్శితమైంది. కరోనా తరువాత ఇంతటి ఘనవిజయం సాధించిన చిత్రం మరొకటి ఇప్పటి దాకా కానరాదు. ఇన్నివిధాలుగా స్టార్ హీరోస్, భారీ చిత్రాలకు ఊపు తెచ్చిన సినిమా కాబట్టి ‘అఖండ’ను డిసెంబర్ 2న మననం చేసుకోవడం సముచితమే!