Akbaruddin Owaisi : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సభలో తన ప్రత్యేక శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, అవి అమలయ్యే విధానం, ప్రజలకు అందే ప్రయోజనాలను ఉద్దేశించి ఆయన ఒక ఫన్నీ స్టోరీ చెబుతూ నేరుగా ప్రభుత్వ తీరును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు ఫేకులు గురించి ఒక కథను వినిపించారు. ఈ కథ ప్రభుత్వాలు చేసే వాగ్దానాలను నమ్మే పరిస్థితి ఎంత అసాధారణంగా మారిందో చాటిచెప్పే విధంగా ఉంది.
“హైదరాబాద్‌లో ఇద్దరు ఫేకులు ఉండేవారు. వీరిద్దరూ ఫేకుల్లోకల్లా పెద్దకులు. ఒకసారి వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఇలా గొప్పలు చెప్పుకున్నారు.
👉 మొదటి ఫేకు: ‘మా తాత దగ్గర ఉన్న భూమి ఎంతంటే… విత్తనాలు చల్లుకుంటూ వెళ్తే, ఆఖరి విత్తనం పడేంత సమయంలో మొదటి విత్తనం కోతకు వచ్చేస్తుంది.’
👉 రెండో ఫేకు: ‘మా తాత దగ్గర ఒక పెద్ద వెదురు బొంగు ఉంది. అది ఎంత పెద్దగా ఉందంటే… ఆకాశంలో ఇటు నక్షత్రాలను అటు, అటు నక్షత్రాలను ఇటు జరిపేంత పొడవుగా ఉంటుంది.’
👉 మొదటి ఫేకు: ‘అంత పెద్ద బొంగు ఎక్కడ దాచిపెట్టావ్?’
👉 రెండో ఫేకు: ‘మీ తాత భూమిలో!’
ఈ కథను వినిపించడంతో అసెంబ్లీలో సభ్యులు ఒక్కసారిగా నవ్వులు పూయించారు. అయితే, ఈ కథ వెనుక అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పాలనుకున్న అర్థం వేరే ఉంది.
ప్రభుత్వాల హామీలు – ఖజానా ఖాళీ!
అక్బరుద్దీన్ వ్యంగ్యంగా చెప్పిన ఈ కథ ద్వారా ప్రభుత్వాల హామీల తీరును ఎత్తిచూపారు. ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తుంటాయి. అయితే, ఆ హామీలను నెరవేర్చడానికి అవసరమైన నిధులు లేవు. ‘ఇది చేస్తాం, అది ఇస్తాం’ అంటూ ప్రజలను విశ్వసింపజేసేలా హామీలు ఇస్తూ, ఆర్థిక భారం పెంచుకుంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతోందని ఆయన అన్నారు. కేవలం ప్రచార హామీలతో కాకుండా, నిజంగా అమలు చేయగలిగే విధంగా హామీలు ఇచ్చి, ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘నేను ఎవరినీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం లేదు, కానీ మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన కథ వినిపించగానే నవ్వులు పూశాయి. అయితే, ఆ కథకు అంతర్భాగమైన ప్రభుత్వాల హామీలు, ఆర్థిక స్థితిగతుల మధ్య అంతరం అందరికీ అర్థమైంది. ప్రభుత్వాలు చాలా హామీలు ఇచ్చినా, ప్రయోజనం పొందే స్థాయిలో ప్రజలకు అందడం లేదు. ఈ వ్యాఖ్యల ద్వారా, ప్రభుత్వ విధానాలను పునఃసమీక్షించి, అసలు లబ్దిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తొలిసారేమీ కాదు – ఓవైసీ తరచూ ఇలాంటి విమర్శలు చేస్తూనే ఉంటారు
అక్బరుద్దీన్ ఓవైసీ తన ప్రసంగ శైలిలో వ్యంగ్యాన్ని మేళవించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన ప్రభుత్వ విధానాలను, హామీలను, ఆచరణలో ఉంచే తీరును విమర్శిస్తూ అనేక సందర్భాల్లో తన ప్రత్యేకమైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ కథ కూడా అలాంటిదే! మొత్తానికి, అసెంబ్లీలో ఓవైసీ చెప్పిన కథ నవ్వులు తెప్పించినా, దాని వెనక ఉన్న అసలైన సందేశం ముఖ్యమైంది. ప్రభుత్వాలు పరిశీలనాత్మకంగా, ప్రజలకు నిజమైన ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఈ కథ ద్వారా ఆయన సూచించారు.
MLC Kavitha : ఎంఎంటీఎస్ రైలు ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం