మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి. శ్రీనివాసరావు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం పూజతో మొదలైంది. ముఖ్య అతిధిగా వచ్చిన ఆకాష్ పూరి హీరో, హీరోయిన్ల పై తొలి సన్ని వేశానికి క్లాప్ కొట్టారు. నిర్మాత రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అయినా లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి.17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్ జరుపుతాం. హైదరాబాద్ లో జరిగే రెండవ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుంది’ అన్నారు.
దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీస్తున్నానని నిర్మాత వి.శ్రీనివాసరావు చెప్పారు. హీరోగా ఇది తనకు మూడో సినిమా అని చైతన్య పసుపులేటి తెలిపారు. ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’తో పాటు విజయదేవరకొండ ‘ఖుషి’లో, ‘అనంత’ సినిమాలో హీరోయిన్ గా నటించానని ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందంటున్నారు రితిక చక్రవర్తి. ఈ సినిమాకు సుధాకర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. స్వరూప్ – హర్ష సంగీతాన్ని సమకూరుస్తున్నారు.