NTV Telugu Site icon

Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ -శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్)‌ల ‘‘మహాయుతి’’ కూటమి భావిస్తుంటే, బీజేపీ కూటమికి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్)‌ల ‘‘మహావికాస్ అఘాడీ’’ భావిస్తోంది. నవంబర్ నెలలో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Agniveers: ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి..

ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర అధికార ‘‘మహాయుతి’’ కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కేవలం సమావేశం ప్రారంభమైన 10 నిమిషాలకే అజిత్ పవార్ బయటకు వచ్చేశారు. కేబినెట్ ప్రతిపాదనలను ఆమోదించేందుకు అజిత్ పవార్ నిరాకరించినట్లు సమాచారం. మొత్తంగా కేబినెట్ 38 నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటి గురించి ముందస్తు నోటిఫికేషన్ లేకపోవడం, సమాచారం ఇవ్వకపోవడంపై అజిత్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

రతన్ టాటాకి కేబినెట్ సంతాపం తెలిపిన తర్వాత అజిత్ పవార్ సమావేశం నుంచి బయటకు వచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు ఇదే చివరి కేబినెట్ సమావేశం. ఆర్థిక ప్రతిపాదనల్ని ఆమోదించే విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీట్ల ప్రతిపాదన పూర్తి కాకముందే ఇలా ఒకేసారి ఇన్ని ప్రతిపాదనల్ని ఆమోదించే విషయంలో విముఖత వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఆర్థికమంత్రిగా అజిత్ పవార్ ఉన్నారు.