అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇవాళ అవుట్ పేషెంట్ విభాగాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసి ఉంచాలంటూ గత శనివారం ఢిల్లీ ఎయిమ్స్ జారీ చేసిన మెమోరాండంను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఔట్ పేషెంట్ సేవలు(ఓపీడీ)సహా అన్ని విభాగాలు యథావిధిగా తెరిచి ఉంచాలంటూ నిన్న (ఆదివారం) తాజాగా మరో మెమోరాండంను హస్పటల్ యాజమాన్యం జారీ చేసింది. అన్ని కేంద్రాల, విభాగాల అధిపతులు, యూనిట్లు, బ్రాంచ్ ఆఫీసర్లు తమ పరిధిలో పని చేసే ఉద్యోగులకు ఈ సమాచారం అందజేయాలని తెలిపింది. రోగులకు అసౌకర్యం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏయిమ్స్ ప్రకటించింది. ఓపీడీ సహా అన్ని సేవలు ఇవాళ యథావిధిగా కొనసాగుతాయని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ కూడా వెల్లడించింది.