NTV Telugu Site icon

Mallikarjun Kharge: తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు

Congress

Congress

Mallikarjun Kharge: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అందుకు బీఆర్‌ఎస్ సహకరిస్తుందన్న ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఏ టీం, బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీం అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్‌లో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ.. మేము తెలంగాణ ఇస్తేనే బీఆర్‌ఎస్‌ వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. తెలంగాణకి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. మోడీ, అమిత్ షా, కేసీఆర్ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Also Read: BRS Praja Ashirvada Sabha at Alair: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం: సీఎం కేసీఆర్

అంతకు ముందు సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో మల్లిఖార్జున ఖర్గే పాల్గొని.. బీఆర్​ఎస్​, బీజేపీలపై విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్​ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందని.. ఇప్పుడు కూడా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణను అప్పులకుప్పగా మార్చిందని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ సర్కారు ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పిందని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్​ స్థాపించిన సంస్థలతో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 బోనస్​ ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.

Also Read: Minister KTR: గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలే..