T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్‌గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది. రేపు సీనియర్లు, రేవంత్ టీమ్‌తో దిగ్విజయ్ సింగ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 7.45గంటలకు ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. టీ-కాంగ్రెస్‌లో సమస్యల పరిష్కారంపై దిగ్విజయ్ సింగ్ దృష్టి సారించనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల చీలికలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వలస నేతలు, ఒరిజినల్ నేతలు అంటూ విమర్శలు చేసుకున్నారు. టీపీసీసీ కమిటీల విషయంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంట టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన నేతలు ఈ నెల 18న తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరంగా ఉన్నారు. మంగళవారం పార్టీ సీనియర్ నేతలు సమావేశం అవ్వాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను సమస్యలను పరిష్కరించాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు తలపెట్టిన సమావేశం వాయిదా పడింది.
Covid Bells: మళ్లీ దడ పుట్టిస్తున్న కొవిడ్ కేసులు.. భారత్‌కు నాలుగో వేవ్ ముప్పు!
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను చక్కదిద్దేందుకు గాను దిగ్విజయ్‌ను ఏఐసీసీ పరిశీలకుడిగా నియమించింది. దిగ్విజయ్ సింగ్ సూచనతో సీనియర్లు మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జుున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్‌లు రాష్ట్రానికి చెందిన పలువురు పార్టీ నేతలతో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేశారు. ఈ ఫోన్లతో సీనియర్లు కొంతమేర శాంతించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో మాట్లాడేందుకు వస్తున్న దిగ్విజయ్ సింగ్.. వారితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోనూ మాట్లాడతారా ? అనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ఎంపీ వెంకట్ రెడ్డి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కొనసాగడం లేదా వేరే పార్టీలోకి వెళ్లడం వంటి అంశాలను ఎన్నికలకు నెల రోజుల ముందే చెబుతానని అన్నారు. అప్పటివరకు తన నియోజకవర్గం అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సన్నిహితుడిగా పేరున్న దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగితే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కూల్ అవుతారేమో చూడాలి.