TPCC Chief Mahesh Kumar Goud: గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఎవరు సారథ్యం వహించబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఒక బీసీ నేతను టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ పదవి కోసం ఎంతో మంది ఆశావహులు పోటీ పడినా చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికే అధినాయకత్వం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.
Read Also: TPCC Chief : టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం
ఇప్పటివరకు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్న నిబంధనల ప్రకారం మూడేళ్లు పూర్తయిన అనంతరం పీసీసీగా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఓపెన్‌గా పార్టీలో కూడా చెప్పారు. అంతే కాకుండా తనను పీసీసీ నుంచి తప్పించడం వల్ల ప్రభుత్వంపై దృష్టి సారించగలనని.. పీసీసీ వ్యవహారాలు మరొకరు చూస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: AP and Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం.. రూ.3,300 కోట్లు విడుదల
ఈ క్రమంలోనే కొత్తగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై భారీ ఎత్తున కసరత్తు జరిగింది. ఈ క్రమంలో పీసీసీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పుడున్న సామాజిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలని కూడా చర్చించినట్లు తెలిసింది. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పీసీసీగా ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రిగా అగ్ర కులాలకు సంబంధించిన వారు ఉంటే.. పీసీసీగా బీసీలు లేదా ఇతర వర్గాలకు సంబంధించిన వారికి అవకాశం కల్పించాలనేది సరైన నిర్ణయమని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే ఈ సారి బీసీలకు పీసీసీ ఇవ్వబోతున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మధుయాస్కి గౌడ్ అనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ఫైనల్‌గా మహేష్‌కుమార్ గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ అధిష్ఠానం తన నిర్ణయాన్ని వెలువరించింది.
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన సమయం నుంచి మహేష్ కుమార్ గౌడ్ పూర్తి మద్దతుగా నిలిచారు. దీంతో తన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా మహేష్ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధిష్ఠానం నిర్ణయించింది. అందులో భాగంగా రేవంత్‌కు సహకారం అందిస్తూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉండాలని పార్టీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్.. సీఎ రేవంత్‌తో కలిసి పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది.