Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?

Air India Plane Crash12

Air India Plane Crash12

Air India Plane Crash Anniversary: ఆకాశంలో ప్రయాణించే పక్షి రెక్క తెగితే నేలకూలుతుంది.. కానీ వందల టన్నుల ఇనుప విహంగం రెక్క తెగి జనావాసాలపై పడితే? అది ఊహకందని ప్రళయాన్ని సృష్టిస్తుంది! సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున (జూన్ 12న), అహ్మదాబాద్ నింగిలోకి ఎగిరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే నరకాన్ని సృష్టించింది. 260 మంది అమాయకుల ప్రాణాలను గాల్లోనే కలిపేసింది. సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా? లేక ఫ్యూయల్ కటాఫ్ స్విచ్ థియరీనా? అనే ప్రశ్నలు నేటికీ సమాధానం లేకుండా గాల్లోనే తేలుతున్నాయి. ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తుది నివేదిక కోసం, బాధితుల కుటుంబాలు క్లోజర్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాయి.

ఈ చీకటి రోజుకు ఏడాది పూర్తయినా.. అక్కడ గుండెల్ని పిండేసే దృశ్యాలు అలాగే ఉన్నాయి. రన్‌వే దాటిన కొద్దిసేపటికే ఆ భారీ విమానం అక్కడి మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. విమాన ఇంధనం రేపిన భీకర మంటల తాలూకు నల్లటి మసి గుర్తులు, అస్థిపంజరంలా మారిన ఆ కాంక్రీట్ భవనం నేటికీ ఆ భయానక రాత్రిని గుర్తుచేస్తున్నాయి. ఆ ప్రమాదంలో హాస్టల్‌కు చెందిన 19 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, సిబ్బంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విద్యార్థులు ఎంతో సందడిగా భోజనాలు చేసే డైనింగ్ ఏరియా, కిచెన్ రూమ్‌లలో ప్లేట్లు, వస్తువులు ఏడాది గడిచినా ఆ శిథిలాల మధ్య అలాగే పడి ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు పోయినవారిలో పేద, ధనిక అనే తేడా లేదు. విధి ఆడిన వింత నాటకంలో అందరూ బలయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుమారుడు రుషభ్ రూపానీ కూడా ఉన్నారు. ఆ విషాద వార్త తెలిసిన క్షణాలను ఆయన గుర్తుచేసుకుంటూ.. బాధితులకు న్యాయం జరుగుతుందని, దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం ఉండాలని ఆవేదనతో పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు ఆ గాయాలను తుడిచే ప్రయత్నంలో భాగంగా, దెబ్బతిన్న ఆ పాత హాస్టల్ భవనాన్ని కూల్చివేసి, అన్ని ఆధునిక వసతులతో సరికొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ ఛగన్‌భాయ్ పన్సేరియా ప్రకటించారు.

×
×
Ad

కానీ, ప్రాణాలు కోల్పోయిన సామాన్యుల ఇళ్లలో మిగిలిన తీరని శోకాన్ని ఏ భవనాలు తుడిచిపెట్టగలవు? ఆ హాస్టల్ ఎదురుగా 20 ఏళ్లుగా టీ కొట్టు నడుపుకుంటున్న సీతాబెన్, ఆమె కుమార్తె కాజల్‌బెన్ కళ్లముందే ఆ విమానం కుప్పకూలింది. తన 14 ఏళ్ల కొడుకు ఆకాష్ మధ్యాహ్నం క్యారేజ్ తెచ్చి ఇచ్చాడు. కాసేపు విశ్రాంతి తీసుకోరా అని చెప్పానో లేదో.. అంతలోనే ఆ విమాన రెక్క ముక్క తెగి వాడిపై పడిందంటూ ఆ తల్లి ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. ఇటు గుజరాత్ సరిహద్దుల్లోని దీవ్ ప్రాంతాన్ని కూడా ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక్కడి నుంచే ఏకంగా 14 మంది ప్రయాణికులు ఆ విమానంలో ప్రాణాలు కోల్పోయారు. అందులో ఫైజాన్ రఫిక్ అనే యువకుడి మరణంతో అతని తాత సులేమాన్ ఇబ్రహీం కుటుంబం మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. అదే దీవ్‌కు చెందిన గిరీశ్‌భాయ్ జెత్వా, ఆయన భార్య హేమాక్షి, కుమారుడు ఆదివ్, కుమార్తె తక్షవి.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సెలవులు గడపడానికి స్వగ్రామానికి వచ్చి, తిరిగి యూకే వెళ్లేందుకు విమానం ఎక్కిన కొన్ని సెకన్లలోనే ఆ కుటుంబం మొత్తంగా అంతమైపోయిందని వారి సోదరుడు మహేంద్ర జెత్వా కన్నీరుమున్నీరయ్యారు.

ఈ ఘోర ప్రమాదం తర్వాత విమానయాన రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వెస్ట్రన్ మీడియా కథనాలు పైలట్ తప్పిదమే కారణమనేలా అనుమానాలు రేకెత్తించడంతో, ఎయిర్ ఇండియా తన సిబ్బంది మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. విమాన ప్రమాదానికి దారితీసే హ్యూమన్ ఫ్యాక్టర్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ‘హ్యూమన్ ఫ్యాక్టర్స్ చార్టర్’ కింద ముందస్తు జాగ్రత్తలు, కౌన్సిలింగ్, శిక్షణతో కూడిన ఒక సమగ్ర మానసిక ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేసింది. గత ఏడాది కాలంగా పైలట్లు, సిబ్బంది మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ఎయిర్ ఇండియా దీనిని మరింత ముమ్మరం చేసింది. ఇక, కోర్టుల్లో పరిహారాలు రావచ్చు.. బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు.. కానీ బాధితుల ఇళ్లలోని ఖాళీ కుర్చీలు, వారి జ్ఞాపకాలు మాత్రం ఆయా కుటుంబాలకు నిరంతర ఆవేదనను మిగులుస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఒక్క చిన్న పొరపాటు వందల కుటుంబాల ఆశలను ఎలా సమాధి చేస్తుందో చెప్పడానికి ఈ అహ్మదాబాద్ ప్రమాదమే ఒక సజీవ సాక్ష్యం.