Shanti Dhariwal: ఈ మధ్య రాజస్థాన్ లోని కోటా జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్‌కు ప్రధాన కేంద్రం రాజస్థాన్ లోని కోటా. ఇటీవల కోటాలో కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజస్థాన్ మంత్రి శాంతి ధరీవాల్ స్పందించారు. నెంబర్ 1 గా ఉండాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి, ఎఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి కేసు విషయంలోనూ లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఝార్ఖండ్ బాలిక సూసైడ్ లెటర్ రాసి చనిపోయిందని, ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని పేర్కొ్న్నారు. మంగళవారం కోటాలో ఓ విద్యార్థిని ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే.
ఇక ఈ సందర్భంలోనే బిహార్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయాన్ని కూడా ఉటంకించిన మంత్రి తాను మిగతా విద్యార్థుల కంటే బాగా చదవలేకపోతున్నానని వారి కంటే వెనుకబడి ఉన్నాననే కారణంతో ఆ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఎప్పుడూ మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి కారణంగా పిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇక హాస్టల్స్ లో ఆత్మహత్యలు జరగకుండా ఫ్యాన్లకు స్ప్రింగ్ లు ఉంచాలని హాస్టల్స్ ను ఆదేశించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఎఫైర్ల కారణంగా చనిపోతున్నారంటూ మంత్రి మాట్లాడిన మాటలు దుమారాన్ని రేపుతున్నాయి. పలువురు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. విద్యార్థుల గురించి అలా ఎలా మాట్లాడతారంటూ మండిపడుతున్నారు. ఇక ఈ ఏడాదాలో ఇప్పటి వరకు 25 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే 2020-21 కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన సమయంలో ఎటువంటి ఆత్మహత్యలు జరగలేదు. మంత్రి చెప్పినట్లు నిజంగానే ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది.