మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని 19 వాహనాలు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అనంతరం వాహనాలు ఆగిపోవడానికి కల్తీ డీజిల్ కారణమని తెలుసుకున్నారు. అధిక మొత్తంలో నీరు కలిగిన కల్తీ డీజిల్‌ని ట్యాంకుల్లో నింపినట్లు తెలిసింది. ఈ డీజిల్‌ను రత్లాంలోని దోసి గ్రామ సమీపంలోని భారత్ పెట్రోల్ పంపులో పోసుకున్నారు. ఈ సంఘటన తర్వాత.. స్థానిక పరిపాలనలో కలకలం చెలరేగింది. పెట్రోల్ పంపును వెంటనే సీజ్ చేశారు. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కాన్వాయ్‌లో లేనప్పటికీ.. ఈ సంఘటన భద్రతా వ్యవస్థలో పెద్ద లోపాన్ని చూపిస్తుంది.
READ MORE: Gold Rates: గోల్డ్ ధరలు ఢమాల్.. ఒక్కరోజె రూ. 930 తగ్గిన తులం బంగారం ధర
వాస్తవానికి.. శుక్రవారం మధ్యాహ్నం జరిగే పరిశ్రమల సమావేశంలో పాల్గొనేందుకు రత్లాంకు సీఎం మోహన్ యాదవ్ విమానంలో చేరుకుంటారు. ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లేందు ఈ కాన్వాయ్‌ని ఏర్పాటు చేశారు. అయితే.. శుక్రవారం రాత్రి 19 వాహనాల్లో డీజిల్ నింపారు. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో రాత్రి సయమంలో మెకానిక్‌లను బలవంతంగా రంగంలోకి దించారు. వాహనాల నుంచి ఇంధన ట్యాంకులను తీసివేసి ఖాళీ చేయించి మరమ్మత్తులు చేపట్టారు. ఎయిర్‌స్ట్రిప్ నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ సజావుగా ప్రయాణించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నయీబ్ తహసీల్దార్ ఆశిష్ ఉపాధ్యాయ తెలిపారు. పెట్రోల్ పంపును సీజ్ చేశారు. ఇంధన నమూనాలను సేకరించారు. పంపు యజమాని, ఉద్యోగుల స్టేట్‌మెంట్‌లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
