ఆరడగులకు పైగా ఎత్తు, పసిమి ఛాయ, ఇట్టే ఆకట్టుకొనే రూపం- ఇలాంటి వర్ణన చూస్తే ఏ నవలానాయకుడో అనిపిస్తుంది. ఈ వర్ణనకు తగ్గట్టు ఉన్న అడివి శేష్ ఇంకా నవలానాయకుడు కాలేదు కానీ, నవయువతులకు నవ్వుతో వలవేసే నాయకుడనే చెప్పాలి. ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతోన్న అడివి శేష్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
శేష్ పూర్తి పేరు అడివి శేష్ సన్నీ చంద్ర. విఖ్యాత నవలారచయిత, చిత్రకారులు అడివి బాపిరాజుకు ఈ శేష్ మనవడు. 1984 డిసెంబర్ 17న అడివి శేష్ హైదరాబాద్ లో జన్మించారు. తరువాత వారి కన్నవారు అమెరికా వెళ్ళడంతో అక్కడే శేష్ విద్యాభ్యాసం సాగింది. కాలిఫోర్నియాలోని బర్క్లీ హై స్కూల్ లో చదివిన శేష్ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ పొందారు. శేష్ సమీపబంధువు సాయికిరణ్ అడివి దర్శకుడు. శేష్ కు కూడా సినిమా అంటే ప్రాణం. అందువల్ల నటునిగా రాణించాలనే తపించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మల్లెపూవు’ అనే చిత్రంలో శేష్ నటించారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కింది. తరువాత శ్రీను వైట్ల ‘సొంతం’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో తెరపై కనిపించారు శేష్. చాలా ఏళ్ళకు 2010లో ‘కర్మ’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆ పై పవన్ కళ్యాణ్ ‘పంజా’లోనూ ముఖ్యపాత్ర ధరించారు. “బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దొంగాట” వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లోనే శేష్ కనిపించారు. అయితే అన్నిటినీ మించి ‘బాహుబలి’ మొదటి భాగంలో అడివి శేష్ కనిపించేది కొద్దిసేపే అయినా, ఇట్టే గుర్తుండిపోయేలా నటించారు. “క్షణం, సైజ్ జీరో, అమీతుమీ” చిత్రాలలోనూ శేష్ తనదైన బాణీ పలికించారు.
అడివి శేష్ సొంత కథతో తెరకెక్కిన ‘గూఢచారి’ మంచి విజయం సాధించింది. నిజం చెప్పాలంటే, ఇదే శేష్ సోలో హీరోగా సాధించిన అసలైన విజయం! దీని తరువాత ‘ఎవరు’, ‘మేజర్’ చిత్రాలతోనూ శేష్ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. నాని నిర్మించిన ‘హిట్: ద సెకండ్ కేస్’ కూడా శేష్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది. “కర్మ, కిస్, క్షణం, గూఢచారి, మేజర్” చిత్రాల కథారచయితగా సాగిన శేష్ ఇకపై కూడా తనకు తగ్గ పాత్రలను తానే సృష్టించుకోగల రీతిలో ముందుకు పోతున్నారు. ‘కిస్’ సినిమాతో మెగాఫోన్ పట్టి చేదు అనుభవాన్ని చవిచూసిన అడివి శేష్ మళ్ళీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారో- అని ఆయనను అభిమానించేవారు ఎదురుచూస్తున్నారు. మునుముందు ఏ విధంగా శేష్ అలరిస్తారో చూడాలి.