AAG Sudhakar Reddy: చంద్రబాబు అరెస్ట్‌పై అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటిసారిగా డీఐజీ స్థాయి అధికారిని అరెస్టు కోసం పంపించారని.. రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాప్టర్‌లో తీసుకెళ్తామని చెప్పిందని.. జైలు మాన్యువల్‌ను కూడా కాదని కూడా చంద్రబాబుకి ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబును జైలుకు కూడా ఆయన కాన్వాయ్‌లోనే తీసుకెళ్లారన్నారు. చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరించిందని… ఎంతో గౌరవాన్ని ఇచ్చిందన్నారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సదుపాయాన్ని కల్పించేందుకు కూడా మేము అభ్యంతరం చెప్పలేదన్నారు.
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన
రాజమండ్రి జైలులో ఒక బ్లాక్‌ను ఖాళీ చేయించి పూర్తిస్థాయిలో భద్రతను ప్రభుత్వం చంద్రబాబుకు కల్పించిందని ఆయన తెలిపారు. దీనిని కక్ష్య సాధింపు చర్య.. అని అంటారా అంటూ ప్రశ్నించారు. ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా చూడకుండా ఆమె మీద వ్యాఖ్యలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపితే వ్యవస్థలను మేనేజ్ చేశారని గగ్గోలు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. అరెస్ట్, విచారణ రిమాండ్ సక్రమమైనవని సుప్రీంకోర్టు చెప్పడం ఈ నేతలకు చెంప పెట్టు లాంటిదన్నారు. వారికి అనుకూలంగా తీర్పు వస్తే న్యాయవ్యవస్థ పనిచేసినట్లుగా చెబుతారని.. వ్యతిరేకంగా వస్తే వ్యవస్థలను మేనేజ్ చేశారని అంటారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. న్యాయమూర్తులపై డిబేట్లు పెట్టి మానసికంగా హింసించారన్నారు. జగన్ కక్ష్య సాధించారని ప్రచారం చేశారని.. చంద్రబాబు పట్ల ఎంతో ఉదారంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులు జైళ్లకు వెళ్లారని.. కానీ వారిలో ఎవరికీ చంద్రబాబు లాంటి సదుపాయాలు లభించలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు పట్ల ప్రభుత్వ సహృదయత అర్థం అవుతుందన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు అందించిన ఐఏఎస్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. న్యాయమూర్తులను కూడా కించపరిచిన వీరు రూ.371 కోట్ల ను సక్రమంగా విడుదల చేశామని ఎక్కడైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ సక్రమం కాదని అంటున్నారే తప్ప.. అవినీతి జరగలేదని చెప్పడం లేదన్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంపై చల్లిన బురద… సుప్రీంకోర్టు తీర్పుతో కొట్టుకుపోయిందన్నారు. వాదించిన కేసు గురించి మాట్లాడే హక్కు తనకుందని ఏఏజీ సుధాకర్ రెడ్డి తెలిపారు.