దెందులూరు నియోజకవర్గంలో కేసులు, కొట్లాటలతో వైసీపీ కార్యకర్తలను కూటమి నేతలు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచితనం చేతకానితనం కాదని, కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందన్నారు. రానున్న రోజుల్లో అబ్బయ్య చౌదరి 2.0 చూపిస్తా అని హెచ్చరించారు. దెందులూరులో అబ్బయ్య చౌదరిని తప్పిస్తే రాజకీయం తాము చేసుకోవచ్చని కొందరు భావిస్తున్నారని, అలాంటివి ఏమీ కుదరవన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి తాను బాకీ లేను అని అబ్బయ్య చౌదరి చెప్పుకొచ్చారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో జరిగిన “చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ” కార్యక్రమంలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షులు డీఎన్ఆర్, పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్, నియోజకవర్గాల ఇన్చార్జులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ… ‘దెందులూరులో అబ్బయ్య చౌదరిని తప్పిస్తే మా రాజకీయం మేము చేసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. 40 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి నేను బాకీ లేను’ అని అన్నారు.
Also Read: Bhumana Karunakar Reddy: 1995 సీబీఎన్ సూపర్.. ఇప్పటి సీబీఎన్ చాలా దారుణం!
‘కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయినా మేనిఫెస్టో అమలుపరచడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణించాయి. దెందులూరు నియోజకవర్గంలో కేసులు, కొట్లాటలతో వైసీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కొల్లేరులో అభివృద్ధి ఎవరు చేశారో చర్చకు సిద్ధమా?. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది. మంచితనం చేతకానితనం కాదు. రానున్న రోజుల్లో అబ్బయ్య చౌదరి 2.0 చూపిస్తా. 167 జగనన్న కాలనీలు దెందులూరులో ఉన్నాయి. మీకు దమ్ముంటే 168 కాలనీలు తయారుచేసి చూపించండి’ అని అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు.