NTV Telugu Site icon

Aam Admi Party: ఢిల్లీ వరదలకు హర్యానా సర్కారే కారణం

Delhi Floods

Delhi Floods

Aam Admi Party: దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్ ఆరోపణలు చేశారు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలే లేవు.. అయినా యమునా నది నీటిమట్టం తగ్గకపోగా పెరుగుతోందని సంజయ్ సింగ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయని.. దీనికి కారణం హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని మళ్లించడమేనని ఆయన అన్నారు. ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు.

Also Read: UAE: UAE పర్యటనలో ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్ష

హత్నీకుండ్ బ్యారేజీకి మూడు కాలువలు ఉన్నాయని, ఒక కాలువకు నీళ్లు వదిలితే ఉత్తరప్రదేశ్‌కు వెళతాయని, మరోదాంట్లో నుంచి ఢిల్లీకి, మూడో కాలువ నుంచి హర్యానాకు నీళ్లు వదలవచ్చని ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. వరదలు వస్తే హత్నీకుండ్‌ నుంచి యూపీ, హర్యానా, ఢిల్లీ వైపుకు సమాతూకంలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కారును ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని వదులుతోందని మండిపడ్డారు. మూడు కాలువలను తెరిచి నీటిని వదిలితే ఢిల్లీలో ఈ స్థాయిలో వరదలు వచ్చేవి కావని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఆప్‌ నేతల ఆరోపణలను హర్యానా సర్కారు ఖండించింది. ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ట్విట్టర్‌ వేదికగా జవాబిచ్చింది. ఆప్ ప్రభుత్వ ఆరోపణలు ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉన్నాయని ఆరోపించింది. వరదల నివారణలో తమ అశక్తతను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హర్యానా ప్రభుత్వం విమర్శించింది.