Aamir Khan: బాలీవుడ్‌లో వరుస బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌ను గత కొన్నేళ్లుగా టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఇప్పుడు మరో స్టార్ హీరో అమీర్ ఖాన్‌పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయనే వార్త ముంబై సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జూ బిష్ణోయ్, అలాగే టైసన్ బిష్ణోయ్ పేర్లతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అమీర్ ఖాన్ దేశంలో ‘లవ్ జిహాద్’ను ప్రోత్సహిస్తున్నాడని, దీన్ని తాము ఎంతమాత్రం సహించబోమని, త్వరలోనే ఆయన దీనికి తగిన పరిణామాలు ఎదుర్కొంటాడని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. సనాతన ధర్మానికి, దేశానికి వ్యతిరేకంగా స్టార్‌డమ్ పేరుతో ఇలాంటి పనులు చేసేవారిని తమదైన శైలిలో అణచివేస్తామని, ఇది మొదటి, చివరి హెచ్చరిక అని గ్యాంగ్‌స్టర్లు హెచ్చరించారు.
ఈ పోస్ట్‌లో కేవలం అమీర్ ఖాన్ ప్రస్తావనే కాకుండా, గత నెలలో రాజస్థాన్‌లోని శ్రీ గంగనగర్‌లో 13 ఏళ్ల బాలికపై జరిగిన కిడ్నాప్, లైంగిక దాడి ఘోరమైన నేరాన్ని కూడా ప్రస్తావించారు. ఈ కేసులో అక్కడి అధికార యంత్రాంగం తీసుకున్న వేగవంతమైన చర్యలను అభినందించిన గ్యాంగ్, కొంతమంది రాజకీయ నాయకులు నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. చట్టం నుంచి తప్పించుకోవాలని చూసే నిందితులకు, వారికి అండగా నిలిచే రాజకీయ నాయకులకు తామే స్వయంగా శిక్ష విధిస్తామని హెచ్చరించింది. అలాగే తమ ముఠాకు చెందిన పర్వేష్, హిమాన్షు అనే ఇద్దరు అమరవీరుల త్యాగాలను వృథా పోనివ్వమని, శత్రువులకు తగిన సమాధానం చెప్తామని పోస్ట్‌లో రాసుకొచ్చారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఫేస్‌బుక్ పోస్ట్, ఒక వాయిస్ నోట్ ద్వారా ఈ బెదిరింపుల గురించిన సమాచారం అందింది. దీనిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అమీర్ ఖాన్ లేదా ఆయన టీమ్ నుంచి ముంబై పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. ఒకవేళ అమీర్ ఖాన్ వైపు నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి గట్టి భద్రత ఏర్పాటు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

