Nellore Crime: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై చర్య తీసుకునే వరకూ ఆందోళన విరమించబోమని కుటుంబ సభ్యులు.. స్థానిక ప్రజలు స్పష్టం చేశారు.. దీంతో ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని బంధువులతో చర్చలు జరిపారు. సైదాపురంలో పరిస్థితిని జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డికి తెలియజేయడంతో ఆయన స్పందించారు.
Read Also: Rashmika: మేనేజర్ మోసం.. స్పందించిన రష్మిక
పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మ హత్యాయత్నానికి పాల్పడటంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని గుర్తించారు. కస్టోడియల్ డెత్ గానే భావించి ఎస్‌ఐ నాగబాబు.. కానిస్టేబుల్ వీరభద్రంలను సస్పెండ్ చేశారు. ఘటనపై కావలి డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. ఈ విషయాన్ని డీఎస్పీ తెలియజేసినా వారు శాంతించలేదు. ఎస్.ఐ.ని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేయడంతో సైదాపురం.. రాపూరు రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు నచ్చ చెబుతున్నా ఆందోళన కారులు అంగీకరించలేదు. ఆకాష్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని పట్టుపట్టారు.. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కోటారెడ్డి హామీ ఇచ్చారు. ఆందోళనకారులతో డీఎస్పీ చర్చలు జరుపుతున్నారు.