ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో మూడు జట్లు పోటీపడుతున్నాయి. (పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా). ఈ సిరీస్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కీలకమైనది. పాకిస్తాన్‌లో జరుగుతున్న ఈ సిరీస్ ఆసక్తిగా ఉంది.. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మారే వాతావరణ పరిస్థితులు, స్టేడియంలలో కొత్త లక్షణాలు ఈ మ్యాచ్‌లను మరింత ఉత్కంఠభరితంగా తయారుచేస్తున్నాయి. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే 2 విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది.
ఈ సిరీస్‌లో అత్యంత ప్రత్యేకమైన విషమేంటంటే.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన అత్యద్భుతమైన ఫార్మ్‌తో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 113 బంతులలో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా.. అతని 7,000 వన్డే పరుగుల మైలురాయిని మరింత వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్ కోహ్లీ ఈ ఘనతను 161 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. కేన్ విలియమ్సన్ ఇప్పుడు వన్డేల్లో అత్యంత వేగంగా 7,000 పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.
Read Also: Bhagwant mann: పంజాబ్ సీఎం మార్పుపై భగవంత్ మాన్ ఏమన్నారంటే..!
వన్డేల్లో అత్యంత వేగంగా 7,000 పరుగులు చేసిన ఆటగాళ్లు:
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) – 150 ఇన్నింగ్స్‌లు
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 159 ఇన్నింగ్స్‌లు
విరాట్ కోహ్లీ (భారతదేశం) – 161 ఇన్నింగ్స్‌లు
హషీమ్ ఆమ్లా ఈ ఘనతను సాధించిన తొలి ఆటగాడు. అయితే కేన్ విలియమ్సన్ విరాట్ కోహ్లీని పక్కకు నెట్టి 7,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర విషయమేంటంటే.. దక్షిణాఫ్రికా శక్తివంతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిది. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే 148 బంతుల్లో 150 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని అద్భుత బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోర్ సాధించింది. అలాగే, వియాన్ ముల్డర్ కూడా 64 పరుగులతో సపోర్ట్ ఇచ్చాడు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. కేన్ విలియమ్సన్ 133 పరుగులు సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే 97 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్ జట్టు చివరికి 6 వికెట్ల తేడాతో గెలిచింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని.. ఈ ట్రై-సిరీస్ పాకిస్తాన్‌లో జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాకిస్తాన్‌ను 78 పరుగుల తేడాతో ఓడించింది. రెండవ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 6 వికెట్ల తేడాతో ఓడించి మరింత బలంగా మారింది. కాగా.. 12 ఫిబ్రవరి 2025న, పాకిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య మూడవ మ్యాచ్ జరుగనుంది. ఈ పోటీ ఉత్కంఠభరితంగా ఉండనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫైనల్ మ్యాచ్ 14 ఫిబ్రవరి 2025న కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనుంది.