NTV Telugu Site icon

Lok Sabha Elections2024: చిన్న వయసులో ఎంపీలుగా రికార్డు.. ముగ్గురూ ఒకే రాష్ట్రం..ఒకే పార్టీ

New Project (29)

New Project (29)

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. కౌశంబి, మచ్లిషహర్, కైరానా స్థానాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు. యూపీకి చెందిన కౌశాంబి స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేబినెట్ మంత్రి ఇంద్రజిత్ సరోజ్ కుమారుడు పుష్పేంద్ర సరోజ్‌కు అఖిలేష్ టికెట్ ఇచ్చారు. పుష్పేంద్ర సరోజ్ తన తండ్రి ఓటమికి బీజేపీకి చెందిన వినోద్ సోంకర్‌పై లక్షా 3 వేల 944 ఓట్ల తేడాతో ప్రతీకారం తీర్చుకున్నారు. పుష్పేంద్రకు 5 లక్షల 9 వేల 787 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సోంకర్‌కు 4 లక్షల 5 వేల 843 ఓట్లు వచ్చాయి. 2019లో బీజేపీ అభ్యర్థి వినోద్‌ సోంకర్‌ ఇంద్రజిత్‌ సరోజ్‌పై 38,742 ఓట్లతో విజయం సాధించారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా పుష్పేంద్ర సరోజ్ రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మార్చి 1న పుష్పేంద్ర సరోజ్‌ తన 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

READ MORE: Saripodhaa Sanivaaram: హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌.. భారీ సెట్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌!

యూపీలోని మచ్లిషహర్ స్థానం నుంచి మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ కుమార్తె ప్రియా సరోజ్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రియా సరోజ్ 35 వేల 850 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి భోలానాథ్ (బీపీ సరోజ్)పై విజయం సాధించారు. ప్రియా సరోజ్‌కు 4,51,292 ఓట్లు రాగా, బీపీ సరోజకు 4,15,442 ఓట్లు వచ్చాయి. గతేడాది నవంబర్‌లో ప్రియా సరోజ్‌కి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రియా ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఎన్నికలకు ముందు ఆమె సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.

READ MORE: NEET Result 2024: నీట్ లో మెరిసిన తెలుగు తేజాలు.. ఏపీలో నలుగురికి ఒకటో ర్యాంక్

కైరానా స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ 29 ఏళ్ల ఇక్రా చౌదరికి టికెట్ ఇచ్చింది. ఇక్రా చౌదరి 69 వేల ఓట్లతో గెలుపొందారు. ఆమెకు మొత్తం ఐదు లక్షల 80 వేల 13 ఓట్లు వచ్చాయి. కాగా.. బీజేపీ అభ్యర్థి ప్రదీప్ చౌదరికి నాలుగు లక్షల 58 వేల 897 ఓట్లు వచ్చాయి. ఇక్రా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి పట్టభద్రురాలయ్యారు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఆమె వరుసగా మూడోసారి కైరానా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చౌదరి నహిద్ హసన్‌కి చెల్లెలు.