ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకాలో ఓ ట్విస్ట్ నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు దొంగగా మారిపోయి చోరీ కేసులో అరెస్టు కావడం కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా రాయపుర గ్రామ సమీపంలో బార్ లో జరిగిన చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి స్వయంగా ఈ చోరీ చేశాడని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల క్రితం చిత్రదుర్గ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ బార్‌లో డబ్బులు, మద్యం దొంగిలించి పరారయ్యారు. బార్‌లో చోరీకి పాల్పడుతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డు అయ్యింది.
READ MORE: Nirmala Sitharaman: ఆర్థికమంత్రి డీప్ ఫేక్ వీడియో కలకలం.. ఎఫ్‌ఐఆర్ నమోదు
నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే అంతకు ముందే చిక్కమగళూరులో ఓ కేసులో పోలీసులు ఆ నిందితులను అరెస్టు చేశారు. చిక్కమగళూరు జైలులో ఉన్న రఘుకుమార్, హాసన్‌కు చెందిన దర్శన్, జగదీష్‌ల బాడీ వారెంట్ మీద చిత్రదుర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు చాలా ఏళ్లుగా చిత్రదుర్గ, దావణగెరె, తుమకూరు, చిక్కమగళూరు జిల్లాల్లో దొంగతనాలు, చోరీలు, లూటీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో చిత్రదుర్గలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘుకుమార్‌కు 2,337 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు అదే రఘుకుమార్ దొంగతనాలు చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి రెండు వేలకు పైగా ఓట్లు సంపాధించడం సామాన్యమైన విషయం కాదని, ఇప్పుడు ఇలా చోరీల కేసుల్లో చిక్కుకోవడం మాకే షాక్ గా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.