NTV Telugu Site icon

Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం

Nagapur Heart Attack

Nagapur Heart Attack

ఇటీవల నాగ్‌పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్‌బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ ఖురేషీలో ఏ మాత్రం చలనం లేదు.

Read Also: Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!

దీంతో.. మరొక న్యాయవాది నితిన్ దేశ్‌ముఖ్‌ ను సంప్రదించి వైద్య సహాయం కోసం తరలించాలని జడ్జి చెప్పారు. ఈ క్రమంలో.. వెంటనే న్యాయమూర్తి పవార్, న్యాయవాది దేశ్‌ముఖ్ వెంటనే ఖురేషీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) చోటు చేసుకుంది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం.. “మేము న్యాయవాది ఖురేషీని ఆసుపత్రికి తీసుకుపోయిన వెంటనే, అతన్ని ఐసీయూకి తీసుకువెళ్లారు, కానీ అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు” అని దేశ్‌ముఖ్ చెప్పారు. అయితే.. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ఖురేషీకి పల్స్ లేదు. అనంతరం.. ఖురేషీ వైద్య రికార్డులను పరిశీలించగా, అతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తేలింది.

Read Also: CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం

న్యాయవాది దేశ్‌ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖురేషీ తనకు ఎసిడిటీ వంటి సమస్య ఉందని భావించి కొంతకాలం క్రితం ఎనో తీసుకున్నాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు.. ఖురేషీకి ఇసిజి చేయించుకోవాలని ఒక వైద్యుడు సూచించాడని తెలిపారు. అయితే ఖురేషీ ఇసిజీ చేయించుకోలేదు. ఈ క్రమంలో శనివారం.. కోర్టులో గుండెపోటుకు గురయ్యాడని.. దాని కారణంగా అతను మరణించాడని దేశ్ ముఖ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది ఖురేషీ అకాల మరణం పట్ల నాగ్‌పూర్ న్యాయవాద సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.