Amit Shah: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి సారించింది. ఇప్పటికే.. తెలంగాణకు పలువురు కీలక నేతలను ప్రత్యేక హోదాల్లో నియమించి.. రాష్ట్ర ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో రెండు రోజుల పాటు అమిత్ షా పర్యటించనున్నారు. అయితే.. ముందుగా షెడ్యూల్‌కు ఒకరోజు ముందే అమిత్ షా హైదరాబాద్ చేరుకోనున్నారు. బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న విమోచన దినోత్సవాలకు కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం అమిత్ షా 16న హైదరాబాద్ చేరుకోనున్నారు. అదే రోజు రాత్రి తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
అమిత్ షా షెడ్యూల్ ఇలా..
16వ తేదీ రాత్రి 7.55 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుని బస చేస్తారు. అయితే.. ఇక్కడ బీజేపీ నేతలతో సమావేశం ఉంటుందా.. మరేదైనా షెడ్యూల్‌లో మార్పు ఉంటుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు 17వ తేదీ ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు అమిత్ షా చేరుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొంటారు. 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. 11.50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం.