Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లలో అట్టుడుకుతోంది. ఇటీవల జరిగిన దోడా ఎన్‌కౌంటర్‌లో నలుగుర ఆర్మీ జవాన్లు మరణించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. తాజాగా ఈ రోజు అదే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
ఇదిలా ఉంటే కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)కి సమీపంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలు హతమార్చాయి. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: MAA : ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం.. డీజీపీకి ‘మా’ ఫిర్యాదు
ఇటీవల దోడా జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతున్న సమయంలో ఒక అధికారి సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించిన తర్వాత కుప్వారా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దోడా ఘటనలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, జవాన్లు డి. రాజేష్, బిజేంద్ర, అజయ్ విధి వీరమరణం పొందారు. ఈ దాడికి పాక్ మద్దతు ఉన్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్, దాని షాడో గ్రూప్ ‘కాశ్మీర్ టైగర్’ బాధ్యత వహించింది.
గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జూలై 14న కుప్వారా జిల్లాలో ఎల్ఓసీ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భారత సైన్యం హతమార్చింది. జూలై 6న కుల్గామ్ జిల్లాలో జంట ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ పోరులో ఇద్దరు జవాన్లు మరణించారు. అంతకుముందు జూన్ 26న దోడాలో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చారు.