Cold Storage Collapse: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో విషాదం చోటుచేసుకుంది. యూపీ సంభాల్‌లోని చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిపోవడంతో మొత్తం ఎనిమిది మంది మరణించగా.. 11 మందిని రక్షించారు. ఈ ఘటన గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు.
శిథిలాలలో చిక్కుకున్న వ్యక్తుల కోసం అధికారులు స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారని సంభాల్ డీఎం మనీష్ బన్సాల్ తెలిపారు.ఎన్‌డీఆర్‌ఎఫ్ స్నిఫర్ డాగ్‌ల సహాయంతో చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఉదయం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఇతర బృందాలు కూడా వస్తాయని ఆయన చెప్పారు. కోల్డ్ స్టోరేజీ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంభాల్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు.
Read Also: Marriage: మద్యం మత్తులో మండపానికి వెళ్లడం మర్చిపోయిన పెళ్లికొడుకు.. చివరకు!
యజమానితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని.. ప్రధాన నిందితులు కనిపించకుండాపోయారని ఎస్పీ వెల్లడించారు. వారికి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. శిథిలాలు తొలగించిన తర్వాతే ఈ భవనం కూలిపోవడానికి అసలు కారణం చెప్పగలమని పేర్కొన్నారు. ఇప్పటికే గోడౌన్ శిథిలావస్థకు చేరుకుందని గతంలో వార్తలు వచ్చాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యజమానులను అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్‌గా గుర్తించారు. ఇద్దరి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించి దానిని నిర్మించలేదని అధికారులు తెలిపారు.