భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ దాడుల వల్ల దెబ్బతిన్న రైళ్ల మరమ్మతుల కోసం రూ.5.79 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు.
READ MORE: IT Raids : క్రేన్ వక్కపొడి కంపెనీపై ఐటీ సోదాలు.. 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి స్వాధీనం
ఇప్పటి వరకు 4,549 మందిని అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. రాళ్ల దాడుల ఘటనల వెనక ఉన్న కారణాలను తెలుసుకోవడం కోసం నిజనిర్ధరణ కమిటీ నుంచి నివేదిక కోరిందా? అని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకు జీఆర్పీ, జిల్లా పోలీసులు, స్థానిక అధికారులతో కలిసి ఆర్పీఎఫ్ పని చేస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. రాళ్ల దాడుల వల్ల కలిగే పర్యవసానాలను తెలియజేస్తూ ట్రాకులకు సమీపంలోని నివాస ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సంఘ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు.