Youngest Yoga Instructor: యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనం కోసం భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన బహుమతి. దీనిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెరుగైన జీవన నాణ్యత కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతీయ యోగా గురువులు, బోధకులు వారి అనుచరులపై వారి ప్రభావంతో ప్రసిద్ధి చెందారు. ఈ గురువుల జాబితాలో ఓ చిన్నారి చేరి రికార్డును సృష్టించింది. భారతదేశానికి చెందిన 7 ఏళ్ల బాలిక ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన యోగా శిక్షకురాలిగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన యోగా శిక్షకురాలిగా ధృవీకరించబడినప్పుడు ప్రణ్వీ గుప్తా వయస్సు 7 సంవత్సరాల 165 రోజులు అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. ఆమె 3 1/2 సంవత్సరాల వయస్సులో తన తల్లితో కలిసి యోగాభ్యాసం చేయడం ప్రారంభించింది. 200 గంటల శిక్షణా కోర్సును పూర్తి చేసిన తర్వాత యోగా అలయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా టీచర్‌గా సర్టిఫికేట్ పొందింది.
Read Also: Gangster Atiq Ahmed: జైలులో గ్యాంగ్‌స్టర్.. ఆకలి దప్పులతో అలమటించి పెంపుడుకుక్క మృతి
పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మద్దతుతోనే తాను యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసినట్లు చిన్నారి ప్రణ్వీగుప్తా తెలిపింది. తాను గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ అద్భుత విజయానికి ప్రతిస్పందిస్తూ, ఆమె ఉపాధ్యాయురాలు డాక్టర్ సీమా కామత్ ఇలా వ్యాఖ్యానించారు. ప్రణ్వీ చాలా తెలివైన విద్యార్థిని అంటూ ప్రశంసలు గుప్పించింది. భారతదేశంలో జన్మించిన ప్రణ్వీ, ఆమె కుటుంబం ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.