60 years to Chaduvukunna Ammayilu Movie: తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు. అయితే అన్నపూర్ణ సంస్థలో తొలి తెలుగు నవల చిత్రంగా రూపొందిన ‘చదువుకున్న అమ్మాయిలు’లోనూ నటించి అలరించారు అక్కినేని. డాక్టర్ పి.శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ ఆధారంగా ఈ ‘చదువుకున్న అమ్మాయిలు’ రూపొందింది. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1963 ఏప్రిల్ 10న జనం ముందు నిలచింది.
ఇంతకూ ‘చదువుకున్న అమ్మాయిలు’ ఏం చేశారంటే- సుజాత, వసంత మంచి స్నేహితులు. సుజాత ధనవంతుడైన రఘునాథరావు కూతురు, వసంత మధ్యతరగతికి చెందిన అమ్మాయి. స్నేహితురాలు వసంతకు సుజాత కారు డ్రైవింగ్ చేయమని చెబుతుంది. అనుకోకుండా బ్యాంక్ ఉద్యోగి శేఖర్ కు యాక్సిడెంట్ చేస్తారు. మొదట పోట్లాటతో మొదలైన శేఖర్ పరిచయం తరువాత మంచి స్నేహంగా మారుతుంది. ఇద్దరమ్మాయిలూ ఒకరికి తెలియకుండా ఒకరు శేఖర్ పై మనసు పారేసుకుంటారు. కానీ, శేఖర్, వసంతను ప్రేమిస్తాడు. సుజాత, వసంత చిన్ననాటి స్నేహితురాలు లత వారిని కలుస్తుంది. ఈమెను ఆనంద్ అనేవాడు మోసం చేస్తాడు. అతను శేఖర్ ఉండే వసతి గృహంలోనే ఉంటాడు. వసంతను పెళ్ళాడాలని చూస్తుంటాడు. శేఖర్, వసంత ప్రేమ తెలిసిన సుజాత, తన తండ్రి తీసుకు వచ్చిన పోలీస్ ఇన్ స్పెక్టర్ ప్రభాకర్ ను పెళ్ళాడుతుంది. ఆనంద్, శేఖర్ ను నమ్మించి మోసం చేస్తాడు. అతడిని ఓ కేసులో ఇరికిస్తాడు. దాంతో శేఖర్ మారువేషంలో తిరుగుతూ ఉంటాడు. అతడిని పట్టుకోవాలనే ప్రభాకర్ ప్రయత్నిస్తూ ఉంటాడు. వసంతను ఎలాగైనా తానే పెళ్ళాడాలని చూస్తాడు ఆనంద్. తమ స్నేహితురాలికి అన్యాయం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటారు సుజాత, వసంత. ఆనంద్ పెళ్ళికి సిద్ధమవుతాడు. పెళ్ళి పీటల మీద వసంతకు బదులు లతను చూసి కంగు తింటాడు. సుజాత సాక్ష్యాలతో సహా అతని నేరం బయట పెడుతుంది. దాంతో కోర్టు ఆనంద్ కు శిక్ష విధిస్తుంది. శేఖర్ ను నిర్దోషిగా విడుదల చేస్తారు. ఆనంద్ ను మనసు మార్చుకొని మంచి మనిషిగా తిరిగి రమ్మంటుంది లత. శేఖర్, వసంత మాలలు మార్చుకోవడంతో కథ ముగుస్తుంది.
Read Also: Ravanasura: బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుందా?
సావిత్రి, కృష్ణకుమారి, ఈ.వి.సరోజ, గుమ్మడి, రేలంగి, పద్మనాభం,శోభన్ బాబు, సూర్యకాంతం, హేమలత, రామన్న పంతులు, కొప్పరపు సరోజిని, అల్లు రామలింగయ్య, డి.వి.యస్.మూర్తి తదితరులు నటించారు. ఈ చిత్రానికి యద్దనపూడి సులోచనారాణి, ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్ తో కలసి నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు సినిమా అనుకరణ రూపొందించారు. ఈ సినిమాకు త్రిపురనేని గోపీచంద్ మాటలు రాశారు. ఆరుద్ర, దాశరథి, కొసరాజు, సి.నారాయణరెడ్డి పాటలు పలికించారు. యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. కె.విశ్వనాథ్ ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గానూ పనిచేశారు.
ఈ చిత్రంలోని “ఒకటే హృదయం కోసం…”, “కిలకిల నవ్వుల…”, “ఏమండోయ్ నిదుర లేవండోయ్…”, “ఆడవాళ్ళ కోపంలో అందమున్నది…”, “నీకో తోడు కావాలి…”, “ఓహో చక్కని చిన్నది…”, “ఏమిటీ అవతారం…”, “వినిపించని రాగాలే…” అంటూ సాగే పాటలు జనాన్ని అలరించాయి. ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రానికి మంచి ఆదరణ లభించినప్పటికీ, అప్పటికే విడుదలైన ‘లవకుశ’ ముందు ఈ సినిమా నిలువలేకపోయింది. శతదినోత్సవం జరుపుకుంది. రిపీట్ రన్స్ లోనూ అలరించింది