Bill Gates : సూడాన్‌లో నెలకొన్న అంతర్యుద్ధం మూలంగా దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇతర దేశాలు దాడి చేస్తే సైన్యం, ప్రభుత్వంతో కలిసి ప్రజలు కూడా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అదే తమ దేశంలోని సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూడాన్‌పై పట్టుకోసం రెండు సాయుధ బలగాల మధ్య రెండు నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా ఆకలికి తాళలేక రాజధాని ఖార్టూమ్‌లోని ఓ అనాథాశ్రమంలో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తోంది.దేశంలో ఆధిపత్య పోరు కారణంగా లక్షలాది మంది ప్రజలు వలస బాటపట్టారు. మరోవైపు ఈ యుద్ధం అక్కడి చిన్నారుల పట్ల శాపంగా మారింది.
Read Also: Bill Gates : బిల్ గేట్స్ మెచ్చిన బుక్స్.. వెబ్ సిరీస్ ఎంటంటే!
అసోసియేటెడ్ ప్రెస్ నివేదించిన వివరాల ప్రకారం.. సూడాన్‌పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారామిలిటరీ బలగాలకు మధ్య రెండు నెలలుగా ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆధిపత్య పోరులో పడి అక్కడి పాలకులు చిన్నారుల సంగతే మర్చిపోయారు. దీంతో పాలు లేక పసి ప్రాణాలకు నీళ్లు పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో తినడానికి తిండిలేక, వైద్యం అందని పరిస్థితుల మధ్య ఆరు వారాల వ్యవధిలోనే 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అందులో రెండు రోజుల వ్యవధిలోనే 26 మంది పసికందులు చనిపోయారు. ఎక్కువమంది చిన్నారులు ఆహారం అందక, జ్వరంతో ప్రాణాలు కోల్పోయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.