Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traditional Karam Podi Recipes: తెలుగువారి వంటింట్లో కారప్పొడులకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరలు వండటానికి సమయం లేనప్పుడైనా, నోటికి కాస్త ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడైనా వేడి వేడి అన్నంలో కాసింత కారప్పొడి, కాసిన్ని నెయ్యి చుక్కలు పడితే ఆ తృప్తే వేరు. కేవలం భోజనానికే కాకుండా ఉదయం పూట వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోశలు, ఉప్మాలలోకి కూడా ఈ పొడులు అద్భుతమైన కాంబినేషన్. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారాలు, నెలల తరబడి నిల్వ ఉండేలా, ఇంటిల్లిపాదికీ నచ్చే 6 రకాల సాంప్రదాయ కారప్పొడుల తయారీ విధానాలు:
కరివేపాకు కారప్పొడి
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో గుమగుమలాడే కారప్పొడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, ఇడ్లీలలో నంజుకున్నా అద్భుతంగా ఉంటుంది.
Also Read
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
కావాల్సిన పదార్థాలు:
* కరివేపాకు: 2 మీడియం సైజు కట్టలు (కడిగి, తడి లేకుండా ఆరబెట్టినవి)
* ఎండు మిరపకాయలు: 20 నుండి 25
* ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
* జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
* చింతపండు: చిన్న ఉసిరికాయ సైజు అంత
* వెల్లుల్లి: 1 మీడియం సైజు గడ్డ (రెబ్బలుగా విడదీసినవి)
* నూనె: 3 టీస్పూన్లు
* కల్లుప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలను లో ఫ్లేమ్‌లో మాడకుండా దోరగా వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఒక టీస్పూన్ నూనె వేసి, తుంచి పెట్టుకున్న ఎండు మిరపకాయలను లో ఫ్లేమ్‌లో చక్కగా వేయించి తీసుకోవాలి. ఆపై మరో రెండు టీస్పూన్ల నూనె వేసి, తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి క్రిస్పీగా మారేంత వరకు వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మరియు సరిపడా కల్లుప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత క్రిస్పీగా వేగిన కరివేపాకు, చిన్న ఉసిరికాయంత చింతపండు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా విడదీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకటి లేదా రెండు సార్లు పల్స్ తిప్పి తీస్తే ఘుమఘుమలాడే కరివేపాకు కారప్పొడి సిద్ధమవుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే ఎన్నో నెలల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.
నువ్వుల కారప్పొడి
నువ్వులు, పల్లీల కాంబినేషన్లో కమ్మని రుచితో పాటు శరీరానికి బలాన్నిచ్చే ఆరోగ్యకరమైన పొడి.
కావాల్సిన పదార్థాలు:
* తెల్ల నువ్వులు (లేదా నల్ల నువ్వులు): 1 కప్పు
* పల్లీలు (వేరుశనగ గుళ్ళు): పావు కప్పు
* ఎండు మిరపకాయలు: 10
* ధనియాలు: 1 టీస్పూన్
* జీలకర్ర: అర టీస్పూన్
* కరివేపాకు: 1 గుప్పెడు (లేదా 4-5 రెమ్మలు)
* వెల్లుల్లి రెబ్బలు: 10 నుండి 12
* పసుపు: పావు టీస్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
* చింతపండు: చిన్న ముక్క (ఆప్షనల్)
తయారీ విధానం:
పాన్‌ను వేడి చేసి అందులో ధనియాలు, జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లో మాడకుండా దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో పావు కప్పు పల్లీలు వేసి లోపలి వరకు వేగేలా నిదానంగా వేయించి పక్కన పెట్టాలి. అనంతరం ఒక కప్పు నువ్వులు వేసి, చిటపటలాడి సువాసన వచ్చి ఉబ్బినట్లు అయ్యేంత వరకు వేయించి తీసి పల్లీలతో పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి మెత్తగా పొడి చేయాలి. ఆ తర్వాత చల్లారిన పల్లీలు, నువ్వులను వేసి నూనె తేలకుండా 4-5 సార్లు పల్స్ ఇస్తూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు సార్లు పల్స్ తిప్పితే కమ్మని నువ్వుల పొడి సిద్ధమవుతుంది. ఇది పూర్తిగా ఆరిన తర్వాత సీసాలో నిల్వ చేసుకుంటే 15 నుండి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
శనగ గింజల పొడి (పల్లి కారప్పొడి)
రాయలసీమ స్పెషల్ శనగ గింజల పొడి. ఇడ్లీ, దోశలపై నెయ్యితో చల్లుకున్నా, అన్నంలో కలుపుకున్నా ఎంతో రుచిగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
* పల్లీలు (వేరుశనగ గుళ్ళు): 1 కప్పు
* ఎండు మిరపకాయలు: 15
* ధనియాలు: 1 టీస్పూన్
* జీలకర్ర: అర టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు: 15 (పొట్టు తీయనక్కర్లేదు)
* కరివేపాకు: 2 రెమ్మలు (ఆప్షనల్)
* నూనె: 1 టీస్పూన్
* కల్లుప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
పాన్‌లో ఒక కప్పు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా మంచి సువాసన వచ్చేలా లోపలి వరకు దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మరియు కరివేపాకు వేసి మాడకుండా దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మొదట వేయించిన ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీయని పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కల్లుప్పు వేసి మరీ మెత్తటి పౌడర్లా కాకుండా పలుకులుగా ఉండేటట్లు (కోర్స్‌గా) మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసిన వేడి తగ్గాక గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఈ శనగ గింజల పొడి నెల రోజుల పాటు తాజాగా, ఎంతో రుచిగా ఉంటుంది.
సాంప్రదాయ కందిపొడి
వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకుని కలుపుకుంటే అమృతంలా ఉండే పసందైన ఆంధ్ర కందిపొడి.
కావాల్సిన పదార్థాలు:
* కందిపప్పు: అర కప్పు
* పుట్నాల పప్పు (వేపిన శనగపప్పు): అర కప్పు
* ఎండు మిరపకాయలు: 10
* మిరియాలు: అర నుండి 1 టీస్పూన్
* జీలకర్ర: అర టీస్పూన్
* కరివేపాకు: 1 రెమ్మ
* వెల్లుల్లి రెబ్బలు: 10 (కచ్చాపచ్చాగా దంచినవి)
* ఇంగువ: పావు టీస్పూన్
* నూనె: 1 టీస్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
స్టవ్ వెలిగించి పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు మరియు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో జీలకర్ర, మిరియాలను కూడా మాడకుండా విడివిడిగా వేయించి పక్కన పెట్టాలి. అనంతరం అర కప్పు కందిపప్పును లో ఫ్లేమ్‌లో ఎర్రగా వేయించి, చివర్లో అర కప్పు పుట్నాల పప్పు వేసి జస్ట్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక్క నిమిషం వేయించి స్టవ్ కట్టేయాలి. ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని, తగినంత ఉప్పు మరియు ఇంగువ పొడి చేర్చి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కందిపొడిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
వెల్లుల్లి కారప్పొడి
బాలింతల కోసం ఒంటి నొప్పులు తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి చేసే ప్రత్యేక పొడి. దీనిని సాధారణ వ్యక్తులు కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
* ధనియాలు: 1 కప్పు (చలువ చేయడానికి ఎక్కువ పరిమాణంలో)
* జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
* వెల్లుల్లి: 1 మీడియం సైజు గడ్డ (రెబ్బలుగా విడదీసినవి)
* ఎండు మిరపకాయలు: 6 (కడుపులో మంట రాకుండా తక్కువగా)
* కరివేపాకు: 2 రెమ్మలు
* చింతపండు: చిన్న ముక్క
* నూనె: 2 టీస్పూన్లు
* కల్లుప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేడి చేసి, ఒక కప్పు ధనియాలు మరియు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సిమ్‌లో దోరగా వేయించాలి. అవి కాస్త వేగాక కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వెంటనే వెల్లుల్లి రెబ్బలు, కాస్త చింతపండు ముక్క కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మిశ్రమం చల్లారిన తర్వాత తగినంత కల్లుప్పు చేర్చి మిక్సీ జార్లో (లేదా రోట్లో) కాస్త బరకగా పొడి చేసుకోవాలి. రోజూ వేడి వేడి అన్నంలో మొదటి రెండు మూడు ముద్దల్లో ఈ వెల్లుల్లి కారప్పొడి వేసుకుని తింటే ఒంటి నొప్పులు తగ్గడంతో పాటు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
మినప్పప్పు, వెల్లుల్లి కారప్పొడి
మినప్పప్పు సువాసనతో ఇడ్లీ, దోశ, ముద్దపప్పు అన్నంలోకి అద్భుతంగా సరిపోయే కారప్పొడి.
కావాల్సిన పదార్థాలు:
* మినప్పప్పు: 2 టేబుల్ స్పూన్లు
* ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
* జీలకర్ర: అర టేబుల్ స్పూన్
* ఎండు మిరపకాయలు: 20
* వెల్లుల్లి: 1 గడ్డ (పొట్టు తీయకుండా రెబ్బలుగా విడదీసినవి)
* కరివేపాకు: 4 నుండి 5 రెమ్మలు
* చింతపండు: చిన్న ముక్క (ఆప్షనల్)
* నూనె: 1 టేబుల్ స్పూన్
* కల్లుప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, ముందుగా రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పును సిమ్‌లో దోరగా రంగు మారే వరకు వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు మరియు కాస్త చింతపండు వేసి ఎర్రగా వేయించుకోవాలి. చివరగా పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను వేసి ఒకసారి కలిపేసి వెంటనే ప్లేట్లోకి మార్చి చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని, తగినంత కల్లుప్పు వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి ఇడ్లీలపై నెయ్యితో, దోశలపైన చల్లుకోవడానికి లేదా ముద్దపప్పు అన్నంలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్.
తాజావార్తలు
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!