High Court : కరోనా టైంలో ఆపిన ఉద్యోగుల జీతాలకు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. కరోనా సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం చెల్లింపులను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27కు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Karnataka: రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లు.. ప్రభుత్వం ఆగ్రహం..
తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు, తెలంగాణ పింఛనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో పాటు మరికొందరు రిట్ పిటిషన్లు, పిల్ దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు చైతన్య మిత్ర వాదనలు వినిపించారు.
Read Also: Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. 6.4 తీవ్రతతో కంపించిన భూమి..
కోవిడ్ సమయంలో ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛన్లు కూడా మూడు నెలలపాటు ఆపారన్నారు. 50 శాతం వేతనాలు, పింఛన్లు నిలిపేయడంతో వారు ఇబ్బందులు పడ్డారని నివేదించారు. మూడు నెలలు ఆపిన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించలేదని, వాటిని కూడా విడతల వారీగా చెల్లించారని చెప్పారు. ఈ మొత్తానికి 12 శాతం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోవిడ్ సమయంలో ఆపిన వేతనాలు, పింఛన్లకు 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.