Madhya Pradesh Road Accident Today: మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుల్తాన్‌పూర్ ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి పైగా గాయపడగా.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పెళ్లి బృందం హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు జనాలను బలంగా ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Netanyahu: బైడెన్ తీరును తప్పుపట్టిన ఇజ్రాయెల్ ప్రధాని
వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు కూడా బాధితుల్లో ఉన్నారని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి 10 గంటలకు ఖమారియా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు కలెక్టర్ అరవింద్ దూబే రూ.4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలానే గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.