Jayasudha: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పేరు వినగానే ముందుగా ఆయన తెరకెక్కించిన భారీ చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఆయన కూడా అనేక చిన్న చిత్రాలు రూపొందించారు. వాటి ద్వారా పలువురు నటీనటులుగా గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా జయసుధ నటిగా జనం మదిలో మంచి మార్కులు సంపాదించుకోవడానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆమె నటించిన “జ్యోతి, ప్రేమలేఖలు, ఆమెకథ” చిత్రాలు కారణమని చెప్పక తప్పదు. కేవలం ఒకటిన్నర సంవత్సరాలలోపే ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను పలకరించడమూ, జయసుధను ‘సహజనటి’గా వారి మదిలో నిలపడమూ జరిగిపోయాయి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో జయసుధ నాయికగా ‘జ్యోతి’ చిత్రం నిర్మించిన క్రాంతికుమార్ ఈ ‘ఆమెకథ’ను సైతం తెరకెక్కించారు. 1977 నవంబర్ 19న ‘ఆమెకథ’ వెలుగు చూసింది.
‘ఆమెకథ’ ఏమిటంటే – జీవితం గురించి ఎన్నెన్నో కలలు కంటుంది కథానాయిక. ఆమెను రవీంద్ర అనే వ్యక్తి పెళ్ళాడతాడు. అతని మాటలు, చేతలు అన్నీ ఆమెను ఆకర్షిస్తాయి. తాను కన్న కలలు నెరవేరాయని సంతోషిస్తుంది. వారి ఇంటి సమీపంలోనే ఉండే ఓ జంట ఎంతో అన్యోన్యంగా ఉండడం చూసి తానూ అలా ఉండాలని మురిసిపోతుంది. కానీ, ఆ తరువాత ఆమెకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్త రవీంద్ర, అతనికి అక్కగా ఉంటున్న ఓ మహిళ సంబంధం నిజమైనది కాదని, వారిద్దరూ కలసి అమాయకులైన అమ్మాయిలను మోసం చేసేవారని తెలుసుకుంటుంది నాయిక. ఆమె రవీంద్రను నిలదీస్తుంది. అలా తాను ఎంతోమంది అమ్మాయిలకు తాళి కట్టానని, కావాలంటే చూడు అంటూ అతను పలు తాళిబొట్లు చూపిస్తాడు. అది చూసిన ఆమె చలించిపోతుంది. చివరకు రవీంద్ర కబంధహస్తాల నుండి ఎలా విముక్తి పొందింది అన్నదే ‘ఆమెకథ’.
Nithya Menon: పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన పవన్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్
ఇందులో జయసుధ అభినయం ఆకట్టుకుంది. ఆమె భర్త రవీంద్రగా రజనీకాంత్ నటించారు. మురళీమోహన్, శ్రీప్రియ, సత్యనారాయణ, రావు గోపాలరావు, రమాప్రభ, జయమాలిని ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులోని “పువ్వులనడుగు నవ్వులనడుగు…”, “తహ తహమని ఊపిరంతా ఆవిరైతే…”, “నాకేటైపోతున్నాదిరో యెంకయ్య మామా…”, “పతియే ప్రత్యక్షదైవమే…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘ఆమెకథ’ చిత్రం ‘జ్యోతి’ స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, జయసుధకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్రం జయసుధకు ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును అందించింది. చిత్రమేమిటంటే, రజనీకాంత్ తొలిసారి తెరపై కనిపించిన కె.బాలచందర్ చిత్రం ‘అపూర్వ రాగంగల్’ తమిళ సినిమాలో ఆయనకు జయసుధ కూతురుగా నటించారు. రెండేళ్ళలోనే ఈ తెలుగు చిత్రంలో వారిద్దరూ భార్యాభర్తలుగా నటించడం విశేషం!