Manipur: మే నెలలో మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ అల్లర్లలో జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు మైయిటీ తెగకు చెందిన విద్యార్థులు దారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మరోసారి మణిపూర్ అగ్నిగుండంగా మారింది. ఏకంగా సీఎం బిరేన్ సింగ్ ఇంటిపైనే దాడి జరిగింది. బాధిత వర్గం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. తాజాగా సీబీఐ, మణిపూర్ పోలీసులు, సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని పట్టుకుంది. ఇందులో నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. నిర్భంధించిన వారిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరిని ఇంఫాల్ నుంచి గౌహతికి తీసుకెళ్లారు.
Read Also: Jammu Kashmir: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నార్కో-టెర్రర్ కుట్ర భగ్నం..
రాజధాని ఇంఫాల్ కి 51 కిలోమీటర్ల దూరంలోని కుకీ ప్రాబల్యం ఉన్న చురచంద్‌పూర్ లో పోలీసులు, సైన్యం జాయింట్ ఆపరేషన్ లో నిందితులను పట్టుకున్నారు. పట్టుకున్న వారిని వేగంగా ఇంఫాల్ ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చి సీబీఐ అధికారులకు అప్పగించారు. ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు విమానం ద్వారా గౌహతికి తీసుకెళ్లారు. ఈ అరెస్టుల గురించి తెలుసుకున్న కొందరు ఎయిర్ పోర్టు వైపు వచ్చే ప్రయత్నం చేశారు.
మయన్మార్ సర్జికల్ స్ట్రైక్ కి నాయకత్వం వహించిన కల్నల్(రిటైర్డ్) నెక్టార్ సంజెన్‌బామ్ ని మణిపూర్ పోలీస్(కాంబాట్) సీనియర్ ఎస్పీగా నియమించారు. తాజాగా ఆయన నాయకత్వంలోనే ఆపరేషన్ జరిగింది. గతంలో శాంతి కోసం రాష్ట్రం, కేంద్రం, ఆర్మీతో ఒప్పందం చేసుకున్న కుకీ మిలిటెంట్లు ఇప్పుడు మణిపూర్ అల్లర్లు పెరిగేందుకు కారణమవుతున్నారు.
ఫిజామ్ హేమంజిత్(20) ఏళ్ల యువకుడిని, 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి అనే అమ్మాయిని హత్య చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకున్నామని సీఎం బీరేన్ సింగ్ ఎక్స్ లో షేర్ చేశారు. జూలైలో తప్పిపోయిన ఇద్దర్ని చంపిన ఫోటోలు సెప్టెంబర్ 26న సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసులో వీరిద్దరి మృతదేహాలు లభ్యం కాలేదు. హత్యకు ముందు మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.