NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలం డ్యామ్‌ 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. సాగర్‌ గేట్లు తెరిచే అవకాశం

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Srisailam: ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్‌ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.20 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 200.1971 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి 2,98,573 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా డ్యాం గేట్లు తెరవడంతోపాటు వారాంతపు సెలవులు రావడంతో హైదరాబాద్‌ ఘాట్‌ రోడ్డు మొత్తం 4 కిలోమీటర్ల పైన ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తాయి. కృష్ణమ్మ పరవళ్ల అందాలను చూస్తూ యాత్రికులు సెల్ఫీలు తీసుకుంటూ మైమరిచిపోతున్నారు.

Read Also: Tirumala: అక్టోబర్‌ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఇదిలా ఉండగా.. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్‌ డ్యామ్ వేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్‌ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ఉదయం 7గంటల కల్లా 260.0858 టీఎంసీల నీరు ఉంది. మరో 52 టీఎంసీలు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. సోమవారం సాయంత్రం కల్లా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తూ, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు 4,58,393 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 40,560 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర జలాశయాలకు వరద నిలకడగా కొనసాగుతోంది.