అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్ డెన్ గుట్టు రట్టయింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తూ.. అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తూ.. నెలకి 15-20 కోట్ల వరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న 33 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ… ‘అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్ డెన్ గుట్టు రట్టు చేశాం. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నెలకి 15-20 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని అదుపులోకి తీసుకున్నాం. ముంబై, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పని చేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్‌ల పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు’ అని తెలిపారు.
Also Read: High Court: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు
‘300 డాలర్ల నుంచి 3000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. మూడు లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. అపార్ట్మెంట్స్ ఓనర్స్ పై కూడా విచారణ జరుపుతాం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులను ఉద్యోగాల పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి అమెరికన్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంతరం అమెరికా ఈ-కామర్స్ పేరుతో అక్కడి పౌరులకు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. మీ పేరిట పార్సిల్ వచ్చిందని, దాన్ని అందజేయాలంటే కొంత డబ్బు చెల్లించాలంటూ అడుగుతున్నారు. పార్సిల్ వద్దనుకుంటే వివిధ కంపెనీల పేరిట ఆఫర్లు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా కూపన్లు కూడా కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు. చివరికి డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు పడతారంటూ వారి శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి వారు భయపడే తీరుపై ఆధారపడి 200 నుంచి 3000ల డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు’ అని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు.