Parliament: పార్లమెంట్‌లో గతవారం నెలకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఇరు సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్‌సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో లోక్‌సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సోమవారం సస్పెండ్ చేశారు. ఇటీవలి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష సభ్యుల నిరంతర నిరసనల తర్వాత ఇది జరిగింది.
Read Also: Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుపై సీల్డ్ నివేదికను కోర్టుకు సమర్పించిన పురావస్తు ప్యానెల్
సభలో గందరగోళం సృష్టించినందుకు గాను 33 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) లోక్‌సభ నుంచి మిగిలిన శీతాకాల సమావేశాలకు సస్పెండ్ అయ్యారు. ఇటీవలి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష సభ్యుల నిరంతర నిరసనలు, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన తరుణంలో వారిని స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎంపీలలో కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీకి చెందిన సౌగత రాయ్ ఉన్నారు. స్పీకర్ ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించగా.. స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభలో ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై గత గురువారం సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తం 46 మందిని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసినట్లయింది.
రాజ్యసభలో 48 మంది సస్పెండ్
రాజ్యసభలో 45మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్ సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌తో పాటు మొత్తం 45 మందిని సస్పెండ్ చేశారు. వీరిలో 34 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా.. మరో 11 మందిని ప్రివిలేజెస్ కమిటీ రిపోర్టు అందేవరు సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ తెలిపారు. ఇప్పటికే రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెసె ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌పై శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది.. అంటే ఒక్కరోజులోనే 78 మంది విపక్ష ఎంపీ సస్పెండ్ అయ్యారు. గత వారం 14 మంది సస్పెండ్ అయ్యారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 90 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు.
ఉభయసభలు రేపటికి వాయిదా..
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని పట్టుబడటంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ కార్యకలాపాలు స్తంభించటంతో రేపటికి వాయిదా పడింది.