Bihar: నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో చిన్నారి డైలాగ్ గుర్తుందా మా ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందని ఎంత క్యూటుగా డైలాగ్ చెప్తుందో.. అది సినిమా కాబట్టి ఆ చిన్నారి చెప్పే డైలాగును మనం ఎంజాయ్ చేశాం.. కానీ ఇక్కడ ఓ రోడ్డు మాయం కావడంతో ఆ గ్రామస్తులు షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని ఒక గ్రామ పరిధిలో రోడ్డు మాయమైంది. సాయంత్రం అదే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన గ్రామస్తులు.. తెల్లారి లేచి వచ్చి చూసేసరికి తమ గ్రామానికి రోడ్డు లేకుండా పోయింది. ఈ ఘటన బిహార్, బంకా జిల్లా, రాజౌ పరిధిలోని ఖరౌని గ్రామంలో జరిగింది. అసలు విషయం ఏంటంటే.. ఖరౌని, కదంపూర్ గ్రామాలను కలుపుతూ, రెండు గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది.
Read Also: Crime News: తాళిబొట్టు కొట్టేసిన కొడుకు.. పోలీసులకు పట్టించిన తల్లి
అయితే, ఇటీవల ఒకరోజు గ్రామస్తులు ఉదయం లేచి చూసేసరికి ఆ రోడ్డు స్థానంలో పొలం కనిపించింది. దాంట్లో గోధుమ పంట వేసి ఉంది. ఇది చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ముందురోజు రాత్రి వినియోగించిన రోడ్డు తెల్లారేసరికి మాయమైందని కదంపూర్ గ్రామస్తులు కంగుతిన్నారు. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఆ రోడ్డును ఖరౌని గ్రామానికి చెందిన కొందరు గూండాలు కబ్జా చేసి, దానినే పొలంగా మార్చారని తెలుసుకున్నారు. దీనిపై కదంపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ గూండాలు ప్రజలను బెదిరిస్తూ కర్రలు, రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ఆక్రమించుకున్న స్థలంలో తిరిగి రోడ్డు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.