డిసెంబర్ 2024 విమాన ప్రయాణీకులకు ‘బ్లాక్ నెల’గా మారింది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా 6 విమాన ప్రమాదాలు జరిగాయి. 233 మంది మరణించారు. ఈ గణాంకాలు నిజంగా భయానకంగా మారాయి. ఈ ప్రమాదాలు విమాన ప్రయాణ సమయంలో భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దక్షిణ కొరియాలోని . ముయాన్ విమానాశ్రయంలో ఆదివారం విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది. అక్కడే ఉన్న గోడకు ఢీకొనగా.. విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 179 మంది మరణించారు. వీరిలో 83 మంది మహిళలు, 82 మంది పురుషులు ఉన్నారు. అయితే మరో 11 మందిని ఇంకా గుర్తించలేదు. విమానంలో మొత్తం 181 మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి తిరిగి వస్తున్న 15 ఏళ్ల నాటి బోయింగ్ 737-800 జెట్ విమానం ప్రమాదానికి గురైనట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:03 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
కజకిస్థాన్‌లో ప్రమాదం..
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం బుధవారం (డిసెంబర్ 25న) కజకిస్థాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కుప్పకూలడంతో 38 మంది మరణించారు. అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోంజీ నగరానికి విమానం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్రకారం.. విమానంలో 42 మంది ప్రయాణికులు అజర్‌బైజాన్ పౌరులు, 16 మంది రష్యన్, ఆరుగురు కజకిస్థాన్, ముగ్గురు కిర్గిజ్‌స్థాన్ పౌరులు ఉన్నారు. గ్రోంజీలోని దట్టమైన మంచు కారణంగా దానిని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దాంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్‌పైన విమానం పలుమార్లు గిరగిరా తిరిగి, నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దృశ్యాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చాయి.
బ్రెజిల్‌లో విమాన ప్రమాదంలో 10 మంది మృతి..
బ్రెజిల్‌లోని దక్షిణ నగరం గ్రామాడో పట్టణ కేంద్రంలో డిసెంబర్ 23న ఓ చిన్న విమానం కూలిపోవడంతో పది మంది మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే ప్రమాదం జరిగింది. మానం తొలుత ఓ భవనాన్ని ఢీకొట్టి అనంతరం ఇతర ఇళ్లను ఢీకొడుతూ చివరగా ఫర్నీచర్ దుకాణంలోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ప్రయాణికులందరూ మృతిచెందారు. గ్రామడో పర్వత ప్రాంతంలోని పట్టణం. ఇది పర్యాటకులకు ప్రసిద్ధి. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయనగా ఈ ఘటన జరగడంతో అక్కడి వాసులు షాక్‌కు గురయ్యారు.
అర్జెంటీనా, హవాయిలలో ప్రమాదాలు..
బ్రిటిష్ కొలంబియాలోని ఉత్తర వాంకోవర్ ద్వీపం నార్త్ కోస్ట్ ఏవియేషన్ నిర్వహిస్తున్న BN-2B-26 ఐలాండర్ డిసెంబరు 22న పాపువా న్యూ గినియాలో కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. విమానం వాసు విమానాశ్రయం నుంచి లే-నడ్జాబ్ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. అదే సమయంలో ఓ ఛార్టెడ్ ప్లైట్ అర్జెంటీనాలోని శాన్ ఫెర్నాండో విమానాశ్రయానికి సమీపంలో ఓ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్లిద్దరూ చనిపోయారు. విమానం పుంటా డెల్ ఎస్టే విమానాశ్రయం నుంచి శాన్ ఫెర్నాండో విమానాశ్రయానికి వెళుతుండగా రన్‌వే మీదుగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. అలాగే, డిసెంబర్ 17న.. హవాయిలోని హోనోలులులోని ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఓ విమానం క్రాష్ అయింది. ఇద్దరు పైలట్‌లు మరణించారు. టేకాఫ్ అయిన వెంటనే విమానం అదుపు తప్పి భవనంపైకి దూసుకెళ్లింది.