Diabetes : ప్రతి ఏటా మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జనాభా పెరుగుదలలో పోటీపడ్డట్లుగానే మధుమేహం రోగుల్లోనూ చైనా భారత్ నేనంటే నేనంటూ పోటీపడుతున్నాయి. ఇప్పటికే చైనాలో 141మిలియన్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. మరే దేశంలో ఇంతమంది డయాబెటిక్ పేషంట్లు లేరు. కాగా ఈ విషయంలో భారత్ 77మిలియన్లతో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. వచ్చే 2045నాటికి భారత్లో మధుమేహం బాధితుల సంఖ్య 135 మిలియన్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంచనా వేసింది. దీని బారినపడే వారిలో మహిళల (40 శాతం) కంటే పురుషులే (60 శాతం) అధికంగా ఉంటున్నారు. 2020లో దేశంలో ఏడు లక్షల మంది మధుమేహంతో చనిపోయారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలోకెల్లా కేరళ 19.8 శాతం మధుమేహ బాధితులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఛండీగఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మధుమేహ బాధితుల సంఖ్య పెరగడానికి స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది.