Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా గుండర్ దేహి బ్లాక్ కు చెందిన ఖుతేరి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఊరిలో ఉండే ట్యాంక్ లోని నీరు తాగి 132 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోనే వారికి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 112 మంది జ్వరంతో బాధపడుతుండగా.. 5 మందికి వాంతులు విరేచనాలు, 15 మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఒకే గ్రామంలో ఇంతమంది అస్వస్థతకు గురి కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.
Read Also: Guinness World Record: గిన్నిస్ రికార్డుల్లోకి ఐరాస యోగా డే ఈవెంట్.. ఎందుకంటే..?
ట్యాంక్ లోని నీరు తాగిన వారిలో మరికొంత మంది అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్‌లోని నీరు తాగడం వల్లే రోగాల బారిన పడుతున్నట్లు గ్రామ ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వైద్యులు నీరు మరిగించి తాగాలని, ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచాలని, పాత ఆహారం తినవద్దని సూచిస్తున్నారు. త్రాగునీటిలో క్లోరిన్ టాబ్లెట్ వాడాలని తెలిపారు. అంతేకాకుండా 7 రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే..
జూన్ 17వ తేదీ నుండి ఆ గ్రామంలో జ్వరం మరియు తలనొప్పికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరంగా ప్రతిరోజూ డజన్ల కొద్దీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఒక్కరూ కూడా విషమంగా లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఖుతేరి గ్రామంలో ఇలాంటి కేసులు ఇంకా వస్తున్నాయని సీఎంహెచ్‌వో జేఎల్ యూకే తెలిపారు. అందకోసం గ్రామ పంచాయతీ భవన్‌లో శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ వైద్యం అందిస్తున్నారు. అయితే అధికారులు వాటర్ ట్యాంక్‌లోని నీటి నమూనాలను పరిశీలనకు పంపారు. గ్రామస్థులు అనారోగ్యం పాలవడానికి గల కారణాలేమిటన్నది నివేదిక వచ్చిన తేలనునట్లు సీఎంహెచ్వో వెల్లడించారు.
