ఉత్తర భారత్‌ను తీవ్రమైన వడగాలులు హడలెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులు ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. దీంతో బయటకురావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో వృద్ధులు, పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Purandeswari: కౌంటింగ్ కు సిద్ధం కావాలి..బీజేపీ నాయకులకు పురంధేశ్వరి పిలుపు
భీకరమైన ఎండలు కారణంగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. జలోర్‌లో నలుగురు, బార్మర్‌లో ఇద్దరు కార్మికులు ప్రాణాలొదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా 48. 8 డిగ్రీల ఉష్ణోగ్రతతో హడలెత్తిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. హీట్ స్ట్రోక్ కారణంగానే ప్రజలు అనారోగ్యానికి గురై చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. గత కొద్ది రోజులుగా వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అల్వార్, భిల్వారా, బలోత్రా, జైసల్మేర్‌లలో కూడా తీవ్రమైన వేడిగాలులు కారణంగా మృత్యువాత పడ్డారు. బాధితులందరికీ ప్రభుత్వం ‘రిలీఫ్ ప్యాకేజీ’ అందజేస్తుందని రాజస్థాన్ విపత్తు నిర్వహణ మరియు సహాయ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor: అందాలతో కనువిందు చేస్తున్న జాన్వీ కపూర్..
పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయని అధికారిక సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీకి ‘రెడ్’ భారత వాతావరణ శాఖ వార్నింగ్ జారీ చేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అన్ని వయసుల వారు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో రాబోయే మూడు రోజుల్లో వెచ్చని రాత్రి పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
ఇదిలా ఉంటే దేశంలో ఇంకా రెండు విడతల పోలింగ్ మిగిలి ఉంది. శనివార ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. తాజా వేడి పరిస్థితులు పోలింగ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:Hyderabad: ఆస్ట్రేలియాలో శవమై తేలిన హైదరాబాద్ యువకుడు.. సముద్రంలో మృతదేహం..