Fire Accident: పాకిస్తాన్‌లో దిగువ కోహిస్థాన్‌లోని పట్టాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ, ఆమె అత్తగారు, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు సహా ఒకే కుటుంబంలోని పది మంది సభ్యులు మరణించారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని కోహిస్థాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు లాంతరు నుంచి చెలరేగిన మంటల కారణంగా మహ్మద్ నవాబ్ అనే వ్యక్తికి చెందిన చెక్క ఇంటితో పాటు పక్కనే ఉన్న పశువుల పాక దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులను వెలికితీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారందరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ నవాబ్ భార్య చబ్బర్ బీబీ, అతని తల్లి జాహిదా బీబీ, ఐదుగురు కుమార్తెలు – లిలీ నవాబ్(20), సమ్రియన్ బీబీ(18), సమీనా బీబీ(16), బీబీ సనో(12), అలీనా బీబీ(19), ముగ్గురు కుమారులు – మునీర్ నవాబ్ (5), ముజీబ్ నవాబ్ (9), అజీజ్ నవాబ్ (2) కాలి బూడిదయ్యారు. అగ్నిప్రమాదంలో అనేక పశువులు కూడా చనిపోయాయని వారు చెప్పారు.
Read Also: Boyfriend Suicide: ప్రియురాలు మాట్లాడట్లేదని.. ఉరేసుకున్న టెక్కీ
ఘటనాస్థలానికి రెస్క్యూ సిబ్బంది సకాలంలో చేరుకోకపోవడం వల్లే 10 మంది ప్రాణాలు పోయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ సిబ్బందిపై చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కరంకోరం హైవేపై మృతదేహాలతో బైఠాయించారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. డిప్యూటీ కమీషనర్ మహ్మద్ రఫీక్ వారితో మాట్లాడి.. మరణించిన కుటుంబానికి రూ. 5 మిలియన్ల పరిహారం ప్రకటించిన తర్వాత వారు శాంతించారు. ఈ విషాద ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ముహమ్మద్ ఆజం ఖాన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.