పెళ్లిళ్లకో.. ఫంక్లన్లకో ఇన్విటేషన్ కార్డులిస్తారు. కానీ! పేకాట రాయుళ్లకు ఇన్విటేషన్ కార్డులు పంపడం ఎక్కడైనా విన్నారా? ఎక్కడో కాదు ఇది మన మహానగరంలోనే జరుగుతోంది. సిటీశివారుల్లోని ఫామ్‌హౌజ్‌లను అద్దెకు తీసుకున్న ఓ మాయగాడు.. పేకాట ఆడేందుకు బడాబాబులకు ఇన్విటేషన్ కార్డులు పంపుతున్నాడు. లక్షల్లో ఎంట్రీఫీజును వసూలు చేస్తూ కస్టమర్లకు కావాల్సిన సర్వీసులన్నీ ఇస్తున్నాడు. ఇంతకీ ఆ మాయగాడు ఎవరో తెలుసా? మంచిరేవుల ఫామ్‌హౌజ్‌తో గుట్టు రట్టైన గుత్తా సుమన్. ఎంటర్‌టైన్మెంట్‌కు భాగ్యనగరంలో కొదవలేదు. డబ్బు ఖర్చు చేసే దమ్ముంటే చాలు.. అడిగిన సర్వీసును అందించే బ్రోకర్లు బోలెడున్నారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న గుత్తా సుమన్ అలాంటివాడే. సిటీ శివారుల్లో ఫామ్‌హౌజ్‌లను రెంట్‌కు తీసుకుని, గుట్టుగా పేకాట క్లబ్బులను నిర్వహిస్తున్నాడు. రేంజ్‌ను బట్టి మనోడి సర్వీసు ఉంటుందని తేల్చారు పోలీసులు. ఖర్చును బట్టి ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి రేవుల పేకాట క్లబ్బుపై పోలీసుల రైడింగ్‌తో గుత్తా సుమన్ గుట్టు రట్టయ్యింది. మంచిరేవుల పేకాట క్లబ్బుపై ఆదివారం రైడ్ చేసిన పోలీసులు పేకాటతో పాటు క్యాసినో ఆడుతున్న 30 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో పలువురు రాజకీయ నాయకులతోపాటు, రియల్టర్లు కూడా ఉన్నారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య కూడా ఇక్కడ పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు.
పెళ్లిళ్లకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టే.. గుత్తా సుమన్ పేకాట రాయుళ్లకు కూడా ఆకర్షణీయమైన ఇన్విటేషన్ కార్డులు పంపించేవాడు. రంగు రంగుల విద్యుత్ దీపాలు, ఖరీదైన మద్యం, అధునాత సౌండ్ సిస్టమ్‌తో పాటు.. జూదగాళ్లకు సాయం చేసేందుకు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసేవాడు. ఖర్చు పెట్టే స్థోమతను బట్టి కస్టమర్‌కు సర్వీసులను అందించాడు గుత్తా సుమన్.ఆకర్శనీయమైన సర్వీసులతో కస్టమర్లకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేవాడు గుత్తా సమున్. ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలదాకా ఎంట్రీ ఫీజును వసూలు చేసేవాడు. రేంజ్‌ను బట్టి కస్టమర్లను కేటగిరిలుగా విభజించేవాడు. గుత్తా సుమన్ ఫోన్‌కాల్‌లిస్టులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు చాలా మంది ఉన్నారని, వారితో మనోడు ఎప్పటికప్పుడు చాట్ చేస్తూనే ఉన్నాడని తేల్చారు పోలీసులు. లోకల్‌గా సీక్రెట్ క్లబ్బులను నడిపిస్తున్న గుత్తా సమన్‌కు విదేశాల్లో ఉన్న క్యాసినోల నిర్వాహకులతోనూ సంబంధాలున్నాయి. అక్కడి అనుభవంతోనే ఇక్కడ రెస్టారెంట్లను అద్దెకు తీసుకుని క్యాసినోలు నిర్వహించేవాడు. విజయవాడ మామిడితోటల నుంచి కొలంబో వరకు మనోడికి నెట్‌వర్క్ ఉందని చెబుతున్నారు పోలీసులు. అంతేకాదు.! గుత్తా సుమన్ బాధితుల్లో అనేకమంది ప్రముఖులు కూడా ఉన్నట్టు తేల్చారు.
ఇదే కేసులో టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌కు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. లీజు డాక్యమెంట్స్ తీసుకుని విచారణకు హాజరు కావాలని ఆర్డర్స్ వేశారు. కానీ! ఇప్పటి వరకు ఆయన విచారణకు రాలేదు. ఓ మాజీ ఐపీఎస్ అధికారికి చెందిన ఈ ఫామ్ హౌజ్‌ను నాగశౌర్య తండ్రి లీజ్‌కు తీసుకున్నారు.దీన్నే నాగశౌర్య ఆఫీస్ కింద కూడా ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తున్నారు. గుత్తా సుమన్‌కూడా ఇదే మాదిరి అద్దెకిచ్చారా? ఆయనకు తెలిసే గ్యాంబ్లింగ్ జరుగుతుందా? అన్నది తేలాల్సి ఉంది. గుత్తా సుమన్‌ను రెండ్రోజుల కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు, అతని నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మంచిరేవులో మాత్రమే మనోడు కథ నడిపించాడా? సిటీలో ఇతర చోట్ల కూడా అడ్డాలు పెట్టి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డాడా? అన్నది తేలుస్తున్నారు.ఇటు గుత్తా సుమన్ క్రిమినల్ రికార్డును కూడా బయటకు తీస్తున్నారు. సెటిల్మెంట్లు, కబ్జాలతో పోలీసుల రికార్డుల్లో మనోడికి పెద్ద హిస్టరీనే ఉందని తెలుస్తోంది. గుత్తాపై ఉన్న కేసుల వివరాలను ఏపీ ఇంటెలీజెన్స్ పోలీసులు ఇప్పటికే నార్సింగి పోలీసులకు అందించారు.