కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి 11 సమస్యలపై వినతి పత్రాన్ని ఎంపీలు అంజేశారు. “గ్రామీణ ఉపాధి హామీ పథకం” కింద రూ. 2828 కోట్ల నిధులు బకాయిలు విడుదల చేయాలని, ఏపీకి కేటాయించిన గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద మొత్తం 30 కోట్ల పని దినాలుకు పెంచాలని కోరారు. “ఉపాధి హామీ పథకం” కింద గిరిజన ప్రాంతాలలో కాఫీ ప్లాంటేషన్ పనులకు అనుమతి ఇవ్వాలని, “ఉపాధి హామీ పథకం” కింద ఉద్యానవన సాగుకు మినహాయింపులు ఇవ్వాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
“ఉపాధి హామీ పథకం” నిధులను స్మశాన వాటికల ప్రహరీ గోడల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, “ప్రధాన మంత్రి ఆవాస యోజన” పథకం పనులకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో 113 కిలోమీటర్ల రోడ్డు పనులను అదనంగా “పీఎం గ్రామీణ సడక్ యోజన” లో చేర్చాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అంతేకాకుండా “సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన” కింద దంగేరు గ్రామానికి 324 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కోరారు.