BJP worker arrested by yogi government: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఓ మహిళపై బీజేపీ నేత దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో యోగీ సర్కార్ బుల్డోజర్లతో యాక్షన్ మొదలు పెట్టింది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన సొంత పార్టీ నేతపైనే చర్యలు తీసుకుంది. నోయిడాలోని సెక్టార్ 93 బిలోని గ్రాండ్ ఓమాక్స్ హౌజింగ్ సొసైటీలోని బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణ చేసిన శ్రీకాంత్ త్యాగి ఇంటిని ముందర భాగాన్ని అధికారులు నేలమట్టం చేశారు. సొసైటీ ఉమ్మడి స్థలంలో పామ్ మొక్కలు నాటొద్దని చెప్పినందుకు మహిళపై దుర్భాషలాడుతూ.. దాడి చేశాడు శ్రీకాంత్ త్యాగి, అతని అనుచరులు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం.. యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు శ్రీకాంత్ త్యాగి.
Read Also: Bihar Political Crisis: బీజేపీకి నితీష్ కుమార్ గుడ్ బై.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం
తాజాగా యూపీ మీరట్ జిల్లాలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ త్యాగితో పాటు మరో ముగ్గురిని నోయిడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. త్యాగి తన భార్యతో పాటు ఓ లాయర్ తో తరుచూ టచ్ లో ఉండటంతో పోలీసులు త్యాగి ఎక్కడున్నాడో ట్రేస్ చేశారు. అయితే త్యాగినే బుధవారం స్వయంగా కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.. ఈ లోపే పోలీసులు అరెస్ట్ చేశారు. త్యాగి ఇళ్లు కూల్చేసిన తరువాత ఒక రోజులోనే ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకుముందు త్యాగి భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సోమవారం గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా.. బాధిత మహిళ అడ్రస్ అడిగినందుకు అతని మద్దతుదారులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.