G20 Summit: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమావేశానికి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ హాజరుకావడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం మధ్యాహ్నం తన వెబ్‌సైట్ లో పేర్కొంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లి కియాంగ్ ఈ సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపింంది. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరరకు ప్రీమియర్ లీ కియాంగ్ సెప్టెంబర్ 9, 10న భారతదేశంలో ఢిల్లీలో జరుగుతున్న 18వ జీ 20 సమ్మిట్ కు హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.
అయితే జిన్‌పింగ్ గైర్హాజరుకు కారణాలు తెలపలేదు. అయితే ఈ వారం చివర్లో ఇండోనేషియా జకర్తాలో జరిగే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లను కూడా జిన్ పింగ్ హాజరుకారని తెలుస్తోంది. ఈ రెండు సమావేశాలకు కూడా ప్రీమియర్ లీ కియాంగ్ చైనాకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
Read Also: Viral Video: రైలులో మహిళ పర్సు కొట్టేసిన దొంగ.. చుక్కలు చూపించిన ప్రయాణికులు
చైనా ఇటీవల స్టాండర్డ్ మ్యాపుల్లో భారతదేశానికి చెందిన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తమవిగా చూపింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత తలెత్తింది. ఇది జరిగి కొన్ని రోజుల తర్వాత జిన్ పింగ్ జీ20 సమావేశాలకు హాజరుకావడం లేదనే వార్తలు వెలుగులోకి వచ్చాయి.
అంతకుముందు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్ ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని ప్రధాని మోడీకి తెలియజేశారు. పుతిన్ స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ రానున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశానికి హాజరవుతున్నారు. జీ20 సమావేశాలకు ఒక రోజు ముందు సెప్టెంబర్ 8న ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. జిన్ పింగ్ గైర్హాజరుపై బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు.