NTV Telugu Site icon

Biggest Zoo: ప్రపంచంలోనే అతిపెద్ద జూ.. మన దేశంలోనే..

Zoo

Zoo

ప్రపంచంలోనే అతిపెద్ద జంతుప్రదర్శనశాల(జూ) మన దేశంలోనే అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో రెండేళ్లలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ జూని ప్రముఖ సంస్థ రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (రిల్‌) నిర్మిస్తోంది. అహ్మదాబాద్‌కి 300 కిలోమీటర్ల దూరంగా ఉండే ద్వారకా, జామ్‌నగర్‌ రోడ్డులోని 280 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ వన్యప్రాణుల కేంద్రం ఏర్పాటుకానుంది. దీన్ని ‘గ్రీన్‌ జూలాజికల్‌, రెస్క్యూ అండ్‌ రీహ్యాబిలిటేషన్‌ కింగ్‌డమ్‌’గా పేర్కొననున్నారు.

GodFather : ఆడియో హక్కులు వారికే సొంతం..

కరోనా నేపథ్యంలో జూ పనులు బాగా ఆలస్యమయ్యాయి. లేకపోతే ఇప్పటికే చాల వరకు పూర్తయ్యేవి. ఇకపై ఎలాంటి ఆటంకాలూ రాకపోతే అనుకున్న సమయానికే ఈ కల నెరవేరనుంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. రిల్‌ రిఫైనరీకి వెనక భాగంలో ఉన్న ప్రాంతంలో రోడ్ రోలర్లతో, పొక్లెయిన్లతో నేల చదును చేస్తున్నారు. మట్టి తవ్వకాలు చేపట్టారు. జూ ఎన్‌క్లేవ్‌ నుంచి 27 కిలో మీటర్ల దూరంలో సేఫ్‌ ఎన్‌క్లోజర్స్‌ రానున్నాయి. జూలోకి మొత్తం 79 జాతులకు చెందిన 16 వందల 89 జంతువులను ప్రవేశపెడతారు. ఇందులో 27 జాతులకు చెందిన 257 జంతువులు విదేశాలకు చెందినవి కావటం గమనార్హం.

ఇతర దేశాల నుంచి ఈ జీవులు ఇప్పటికే 2 కార్గో విమానాల్లో ఇండియాకి చేరుకున్నాయి. ఒకటి అహ్మదాబాద్‌లో, మరొకటి జామ్‌నగర్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఎయిర్‌పోర్టుల నుంచి జంతువులను యానిమల్‌ రెస్క్యూ సెంటర్లకు తరలించారు. న్యూట్రిషనిస్టులు, వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయా జంతువుల యోగక్షేమాలను నిత్యం పరిశీలించేందుకు ప్రత్యేక సీసీటీవీ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేశారు. జూలో 10 మేజర్‌ జోన్లు, 73 స్పెషలైజ్డ్‌ ఎన్‌క్లోజర్స్‌ ఉంటాయి. జూ మొత్తమ్మీద ఎగ్జోటిక్‌ ఐల్యాండ్‌ (అన్యదేశ ద్వీపం) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్‌ ఫారెస్ట్‌ జోన్‌లో 238 జంతువులు ఉంటాయి.