PM Modi on Women’s Reservation Bill: నారీ శక్తిని ఎవరూ ఆపలేరు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi on Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నాలను ఎవరూ ఎక్కువకాలం అడ్డుకోలేరని అన్నారు.

నవంబర్ 30, సోమవారం పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత భాగస్వామ్యం కల్పించాలనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

“నారీ శక్తికి భాగస్వామ్యం కల్పించేందుకు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రయత్నాల్లో నేనూ ఒక భాగంగా ఉన్నాను. ఎంతోమంది మహిళలు ఈ అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అనేకమంది సోదరీమణులు లేఖల ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. దేశంలోని నారీ శక్తి ఆశీస్సులు మనకు పూర్తిగా ఉన్నాయని నాకు తెలుసు” అని మోడీ పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ అమలుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగిస్తామని దేశంలోని ప్రతి మహిళకు హామీ ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. తమ ఉత్సాహం, ధైర్యం, సంకల్పం దృఢంగా ఉన్నాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు దేశంలోని మహిళలు పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడాన్ని అడ్డుకోలేవని మోడీ వ్యాఖ్యానించారు. ఇది కేవలం సమయం మాత్రమేనని, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం తప్పదని ఆయన అన్నారు.

మహిళా రిజర్వేషన్ అమలుకు వీలుగా పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికైన ప్రతినిధుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను 50 శాతం వరకు పెంచే ప్రతిపాదన ఇందులో భాగంగా ఉంది. ఈ మార్పులతో పాటు నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించేందుకు కొత్త డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. 2027 జనగణన కోసం వేచి చూడకుండా మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

2026 రాజ్యాంగ (132వ సవరణ) బిల్లును డీలిమిటేషన్‌ బిల్లుగా పేర్కొంటున్నారు. ఈ బిల్లును నవంబర్ 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ప్రకారం..

లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది.
రాష్ట్ర శాసనసభల గరిష్ఠ సభ్యుల సంఖ్య 500 నుంచి 650కి పెరగనుంది.
డీలిమిటేషన్‌కు ముందు ఉన్న సీట్ల సంఖ్యపై 50 శాతం పెంపు ప్రతిపాదించారు.
నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించనున్నారు.

ఈ మార్పుల ద్వారా మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

మూడు బిల్లులతో ఎన్నికల ప్రాతినిధ్యంలో మార్పులు

ప్రతిపాదిత శాసన ప్యాకేజీలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు ఉన్నట్లు సమాచారం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల కేటాయింపుకు 1971 జనగణనను ప్రాతిపదికగా కొనసాగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇక 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా నియోజకవర్గాల పునర్విభజన, సరిహద్దుల మార్పులకు 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించారు. కొత్తగా నిర్ణయించే సీట్ల కేటాయింపులు, నియోజకవర్గాల సరిహద్దులను 2051 వరకు నిలిపివేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే కొత్త నియోజకవర్గాల మ్యాప్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.